మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు.. ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్ ప్రారంభించిన అరవింద్ కేజ్రీవాల్

By Mahesh KFirst Published Aug 19, 2022, 1:09 PM IST
Highlights

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ తనిఖీలు చేసిన నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ప్రారంభించారు. తాము చేపడుతున్న నేషనల్ మిషన్‌లో భాగం కావడానికి 9510001000కు మిస్డ్ కాల్ ఇవ్వాలని అన్నారు.
 

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిలో సీబీఐ తనిఖీలు చేపట్టింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు చేసింది. ఢిల్లీ - ఎన్‌సీఆర్ వ్యాప్తంగా 20 లొకేషన్లలో రైడ్స్ చేశారు. ఓ సీబీఐ బృందం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలోనూ తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఆప్‌కు మద్దతుగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు. నేషనల్ మిషన్‌లో భాగం కావాలని సూచించారు. ఇందుకోసం మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ప్రారంభించారు.

భారత్‌ను నెంబర్ 1 చేయడానికి ప్రజలు నేషనల్ మిషన్‌లో భాగస్వాములు కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఓ వీడియోలో మాట్లాడారు. ఈ నేషనల్ మిషన్‌లో భాగం కావడానికి 9510001000 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. సీబీఐ దాడుల గురించి భయపడాల్సిన పని లేదని ఆయన వివరించారు. వారి పనిని వారు చేయనివ్వండని పేర్కొన్నారు. తమను వేధించడానికి పై నుంచి సీబీఐకి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. తమ పార్టీ నేతలు చేపడుతున్న విప్లవాత్మక కార్యాలు ప్రపంచమంతా కొనియాడుతున్నదని, కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం కానుకగా సీబీఐని పంపించారని విమర్శలు చేశారు. 

ఢిల్లీలో మనీష్ సిసోడియా సారథ్యంలో విద్యలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కేజ్రీవాల్ అన్నారు. ఇదే రోజు అమెరికాలో అతిపెద్ద న్యూస్ పేపర్ ది న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఫ్రంట్ పేజీలో ఢిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ కథనం వచ్చిందని వివరించారు.

click me!