డర్టీ పాలిటిక్స్ .. ప్రజలే సమాధానం చెబుతారు : సిసోడియా అరెస్ట్‌పై కేజ్రీవాల్ స్పందన

Siva Kodati |  
Published : Feb 26, 2023, 09:21 PM ISTUpdated : Feb 26, 2023, 09:42 PM IST
డర్టీ పాలిటిక్స్ .. ప్రజలే సమాధానం చెబుతారు : సిసోడియా అరెస్ట్‌పై కేజ్రీవాల్ స్పందన

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంపై స్పందించారు ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్.  సిసోడియా అరెస్ట్‌ను డర్టీ పాలిటిక్స్ అన్న ఆయన.. దీనికి రాబోయే రోజుల్లో ప్రజలే సమాధానం ఇస్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. దాదాపు 8 గంటల పాటు ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. సిసోడియా అరెస్ట్‌ను డర్టీ పాలిటిక్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి రాబోయే రోజుల్లో ప్రజలే సమాధానం ఇస్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

ALso REad: కేంద్రం కనుసన్నల్లో సీబీఐ.. మనీశ్ సిసోడియాను అరెస్టు చేస్తారని ముందే ఊహించాం: ఆమ్ ఆద్మీ పార్టీ

అందులో ఆయన ఏమన్నారంటే.. ‘‘మనీష్ అమాయకుడు.. ఆయన అరెస్ట్ అనేది నీచ రాజకీయం, సిసోడియా అరెస్ట్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిని అందరూ గమనిస్తున్నారు. ప్రజలు ప్రతిదీ అర్ధం చేసుకుంటారు. దీనిపై ప్రజలే స్పందిస్తారు. దీని వల్ల మా పోరాటం మరింత బలపడుతుందని’’ కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

కాగా.. ఢిల్లీలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి మనీష్ సిసోడియా, తదితరులు అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతేడాది సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం విధానాన్నే అనుసరించి, కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. సిసోడియా ఆధీనంలో వున్న ఎక్సైజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ ప్రభత్వం పాత మద్యం పాలసీనే అనుసరించిందని బీజేపీ ఆరోపించింది. 

అయితే ఈ కేసుకు సంబంధించి సిసోడియా దర్యాప్తు అధికారులకు సహకరించడం లేదని సీబీఐ పేర్కొంది. మరోవైపు.. కేజ్రీవాల్, సిసోడియా ఎదుగుదలను చూసి బీజేపీ భయపెడుతోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి దుయ్యబట్టారు. ఆప్‌కి పెరుగుతున్న ప్రజాదరణే ఈ అరెస్ట్ వెనుక అసలు కారణమని అతిషి వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఇది తప్పుడు కేసని అతిషి అన్నారు. 

ALso REad: కేజ్రీవాల్ కు షాక్: ఏడాదిలోపు ఆప్ రెండో మంత్రి అరెస్టు

మరో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘సీబీఐ పూర్తిగా కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నది. మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తుందని మాకు తెలుసు. ఈ ఎజెన్సీలు ఎలా పని చేస్తాయో ముందే పసిగట్టేయడం, ఊహించడం బాధాకరం’ అని అన్నారు. 

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా ఖండించారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వ దుర్వినియోగపరుస్తున్నదన్న ఆప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘ఆయన విద్యా పరంగా మంచి పనులు చేసి ఉండొచ్చు.కానీ, దాని ఆధారం చేసుకుని లిక్కర్ పాలసీలో అవినీతికి పాల్పడడని చెప్పలేం’ అని పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral Video : ఎయిర్‌పోర్ట్‌లో తండ్రిని చూసి పరుగెత్తిన చిన్నారి.. జవాన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా ! వైరల్ వీడియో
Gig Workers: డిసెంబ‌ర్ 31న జొమాటో, స్విగ్గీ సేవ‌ల్ బంద్‌.. కార‌ణం ఏంటంటే.?