Arvind Kejriwal: శాంతి, ఐక్య‌త లేకుండా దేశం ముందుకు సాగ‌దు.. : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

By Mahesh RajamoniFirst Published Jul 4, 2022, 10:00 AM IST
Highlights

killings in Amravati, Udaipur: అమరావతి, ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్యలను ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. శాంతి, ఐక్య‌త ఉండాల‌నీ, ఇలాంటి దారుణ ఘటనలతో  దేశం ముందుకు సాగ‌దంటూ ఆయ‌న పేర్కొన్నారు. 
 

Delhi CM Arvind Kejriwal: శాంతి, ఐక్య‌త లేకుండా దేశం ముందుకు సాగ‌ద‌నీ, విద్వేషం పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆమ్ ఆద్మీ (ఆప్‌) జాతీయ కార్య‌ద‌ర్శి అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. మహారాష్ట్రలోని అమరావతి, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన హత్యలను ఆయ‌న ఖండించారు. జూన్ 28న.. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో ఇద్ద‌రు దుండ‌గులు.. ఓ షాపులోకి వెళ్లి ఒక టైల‌ర్ ను అత్యంత దారుణంగా త‌ల న‌రికి చంపారు. అలాగే, జూన్ 21న అమరావతిలో కెమిస్ట్ షాప్ యజమాని ఉమేష్ కోల్హేను పలువురు వ్యక్తులు హత్య చేశారు. ఈ రెండు హ‌త్య‌లు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపాయి. ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున ఆగ్ర‌హాన్ని రేకెత్తించాయి. 

ఈ రెండు ఘటనల‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. "ఇలా ఏం జరుగుతున్నా తప్పు, దేశం ఇలా ముందుకు సాగదు. శాంతి, ఐక్యత ఉండాలి. నేను దీనిని ఖండిస్తున్నాను. ఈ దారుణాల‌కు పాల్ప‌డిన నిందితుల‌ను కఠిన శిక్షలు పడతాయని ఆశిస్తున్నాను" అని అన్నారు. "వేలు ఎత్తి చూపడం వల్ల ఏమీ చేయలేము.. దేశంలోని అన్ని ప్రభుత్వాలు, ప్రజలు కలిసి దేశ పరిస్థితిని మెరుగుపరచడం చాలా ముఖ్యం" అని ఆయన అన్నారు. దేశంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలు రోజురోజుకూ పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి దేశ ప్ర‌జ‌లంద‌రూ క‌లిసి  ముందుకుసాగాల‌ని పేర్కొన్నారు. 

Latest Videos

అలాగే, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి కూడా కేజ్రీవాల్ స్పందించారు. ముఖ్యంగా ఈ ఏడాదిలో గుజ‌రాత్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 2022 గుజరాత్ ఎన్నికలలో AAP విజయంపై ఆశ, విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేజ్రీవాల్‌.. గుజ‌రాత్ గెలుపుపై ధీమాను వ్య‌క్తం చేశారు. "AAP గుజరాత్‌లో భారీ స్థాయిలో విస్తరిస్తోంది. 27 ఏళ్ల బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. తమను కాంగ్రెస్ భర్తీ చేయలేదని బీజేపీ భావిస్తోందని అందుకే వారు అహంభావం పెంచుకున్నారు. ప్రజలు ఈసారి ఆప్ వైపు ఆశగా చూస్తున్నారు. రాష్ట్రంలో ఆప్ స‌ర్కారు తీసుకురావ‌డానికి ప్ర‌జ‌ల‌తో క‌లిసి ముందుకు సాగుతాం" అని తెలిపారు. ఈ రోజు 7,000 మంది ఆఫీస్ బేరర్లు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఇంత భారీ స్థాయిలో సంస్థను విస్తరించడం చాలా గొప్ప విషయమని అన్నారు. అందుకే "గుజరాత్ లోని సామాన్య ప్ర‌జ‌లు ఆప్‌ని ఆశా కిరణంగా చూస్తున్నారని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆప్ క‌లిపి న‌డ‌వ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. గుజరాత్‌లో తదుపరి ప్రభుత్వం ఆప్‌దేనని మేము విశ్వసిస్తున్నామని" ఆయన అన్నారు.

కాగా, గ‌తేడాది (2021) ఫిబ్రవరిలో జ‌రిగిన సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (SMC) ఎన్నికల్లో బీజేపీ 93 సీట్లు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 27 స్థానాలను గెలుచుకుంది. ఇక ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఖాతా తెర‌వ‌లేక‌పోయింది. దీంతో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టాల‌ని ఆమ్ ఆద్మీ భావిస్తోంది. ఎలాగైనా బీజేపీ చెక్‌పెడుతూ.. రాష్ట్రంలో అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చేస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన పంజాబ్ ఎన్నిక‌ల్లో తిరుగులెని విజ‌యం సాధించ‌డంతో పాటు కాంగ్రెస్, బీజేపీ స‌హా రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీల‌కు చుక్క‌లు చూపిస్తూ.. అధిక స్థానాల‌ను గెలుచుకుంది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహం, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు గుజ‌రాత్ లో ఆప్ అవ‌కాశాల‌పై ఆశ‌ను పెంచాయ‌ని తెలుస్తోంది. 

click me!