
బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది. దీని కోసం అధికార యంత్రంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మహావికాస్ ఆఘాడీకి నేతృత్వం వహించిన శివసేన పార్టీకి 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 39 మంది షిండే వెంట నడిచారు. దీంతో ఉద్దవ్ ఠాక్రే వద్ద 16 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. ఈ పరిస్థితుల్లో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కలయికతో 2019లో ఏర్పడిన ఎంవీఏ ప్రభుత్వం ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో కూలిపోయింది.
Femina Miss India 2022 : మిస్ ఇండియాగా కర్ణాటక అమ్మాయి సినిశెట్టి..
ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ను ఎంవీఏ నుంచి వైదొలిగి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సీఎం ఠాక్రే ఒప్పుకోలేదు. దీంతో ఎంవీఏ ప్రభుత్వాన్ని సభలో బలం నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్ ను మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. దీంతో సభలో మెజారిటీని చూపించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ దీనిని ఎదుర్కోవడం ఇష్టం లేని ఉద్దవ్ ఠాక్రే తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఈ నెల 30వ తేదీన సీఎంగా ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన శాసన సభ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక జరిగింది. కొత్త స్పీకర్ గా బీజేపీ కి చెందిన ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. ఎంవీఏ తరుఫున పోటీ చేసిన ఎమ్మెల్యే రాజన్ సాల్వీ ఓడిపోయారు. షిండే తిరుగుబాటు చేసినప్పుడు తన వద్ద 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఆదివారం జరిగిన స్పీకర్ ఎన్నికల్లో రాహుల్ నార్వేకర్‌కు అనుకూలంగా 164 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన మొదటి నుంచి చెప్పిన సంఖ్య సరైనదిగానే కనిపిస్తోంది.
288 మంది సభ్యులున్న సభలో బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుగుబాటు సేన వర్గం బలం 39గా ఉంది. రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS), హితేంద్ర ఠాకూర్‌కు చెందిన బహుజన్ వికాస్ ఆఘాది (BVA), ప్రహార్ జనశక్తి పార్టీ వంటి చిన్న పార్టీలు స్పీకర్ ఎన్నిక కోసం షిండే-ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. స్పీకర్ ఎన్నిక కొత్త ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టుగానే.. నేడు జరిగే బల పరీక్ష ను కూడా షిండే ప్రభుత్వం సునాయాసంగా నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్పీకర్ పదవికి, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIM, సమాజ్‌వాదీ పార్టీ దూరంగా ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాల అభ్యర్థికి కేవలం 107 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం విపక్షాల బలం 117గా ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరోగ్య సమస్యల కారణంగా సభకు రాకపోడంతో బీజేపీ స్పీకర్ అభ్యర్థి 164 ఓట్లతో విజయం సాధించారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తెలిపారు. సోమవారం జరిగే విశ్వాస తీర్మానంలో ప్రభుత్వం 166 ఓట్లతో మెజారిటీని నిరూపించుకుంటుందని ధీమా వక్తం చేశారు.