లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ అడిగిన 56 ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. లిక్కర్ స్కాం అనేది లేనే లేదన్నారు
లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షిగానే ఆయనను విచారించినట్లుగా తెలుస్తోంది. సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద కేజ్రీవాల్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు సీబీఐ అధికారులు. సీసీ కెమెరా పర్యవేక్షణలో మౌఖిక, లిఖిత పూర్వకంగా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు సీబీఐ అధికారులు. సీబీఐ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేరుగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం కల్పితమన్నారు. లిక్కర్ స్కాం అనేది లేనే లేదన్నారు. దేశ ప్రజలు మొత్తం తనతోనే వున్నారని.. సీబీఐ అడిగిన 56 ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. ఆప్‌ను అంతం చేయడానికి కుట్ర పన్నినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమ ఎదుట హాజరుకావాలని శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే సీబీఐ వైఖరిని నిరసిస్తూ ఆప్ శ్రేణులు ఢిల్లీలో నిరసనకు దిగాయి. దీంతో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో నిరసన చేస్తున్న ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా.. ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషీ, కైలాస్ గెహ్లోట్, ఆప్ ప్రధాన కార్యదర్శి పంకజ్ గుప్తాతో పాటు పంజాబ్ మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.
2021-22 ఎక్సైజ్ పాలసీ రూపొందించే సమయంలో మద్యం లాబీకి అనుకూలంగా వ్యవహరించారని ఈడీ, సీబీఐలు కేజ్రీవాల్ సర్కార్ పై ఆరోపణలు చేస్తున్నాయి . ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ విచారించడాన్ని విపక్ష నేతలు తప్పుబడుతున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్, తదితరులు మద్దతు ప్రకటించారు.