
న్యూఢిల్లీ: ఈ రోజు ఢిల్లీ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా చేశారు. శుక్రవారం నాడు ఆయన ఓ బౌద్ధుల కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు ఏడు వేల మంది వరకు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1956లో సూచించిన సూత్రాలను చదివారు. హిందు దేవుళ్లను విశ్వసించనని, పూజించనని పేర్కొంటూ ఆ ప్రతిజ్ఞ సాగింది. ఈ ప్రతిజ్ఞలో ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ కూడా ఉన్నారు. తాను కూడా హిందూ దేవుళ్లను పూజించనని పేర్కొంటున్నట్టు వీడియోలో వినిపించింది. ఈ కార్యక్రమంలో మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ హాజరయ్యారు.
మత మార్పిడి కార్యక్రమంలో ఆప్ మంత్రి పాల్గొనడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలు కేవలం మంత్రికే పరిమితం కాలేదు. ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌కు వాటి సెగ తగిలింది. ఎన్నికల కోసమే హిందూ ఆలయాలు తిరుగుతారని, వాస్తవంలో వాళ్లు హిందూ వ్యతిరేకులు అంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కేజ్రీవాల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేజ్రీవాల్ వీటిని తన దైన శైలిలో తిప్పి కొడుతున్నారు.
Also Read: ‘హిందూ దేవుళ్లను పూజించను’.. బౌద్ధ కార్యక్రమంలో ఆప్ మంత్రి ప్రతిజ్ఞ.. వివాదం రేపిన వీడియో
అయితే, సదరు మంత్రిని తొలగించాలని కేజ్రీవాల్‌కు డిమాండ్లు వెళ్లాయి. బీజేపీ నేతలు బహిరంగంగా ఈ డిమాండ్ చేసింది. ఈ తరుణంలోనే ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
మాన్యవార్ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. ఈ రోజున తాను అన్ని రకాల సంకెళ్ల నుంచి విముక్తి పొందినట్టు వివరించారు. ఈ రోజు మళ్లీ జన్మించానని పేర్కొన్నారు. ఇక నుంచి తాను హక్కుల కోసం, సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల పైన ఎలాంటి షరతులు లేకుండా పోరాడుతానని వివరించారు.
వడోదరలో కేజ్రీవాల్ ర్యాలీ వెళ్లే దారిలో ఆప్ వ్యతిరేక బ్యానర్లు వెలిశాయి. వీటిని ఆప్ కార్యకర్తలు తొలగించారు. ఈ ర్యాలీలో నిన్న ప్రసంగిస్తూ జై శ్రీ రామ్ అని నినదించారు. ‘నేను హనుమంతుడి భక్తుడిని. వాళ్లు కాన్సా సంతతి. నేను జన్మాష్టమి రోజున జన్మించాను. ప్రత్యేక లక్ష్యంతో దేవుడు నన్ను ఇక్కడకు పంపాడు. కాన్సా సంతతిని, అవినీతికి పాల్పడేవారిని నాశనం చేయాలని భగవంతుడు నన్ను పంపించాడు’ అని పేర్కొన్నారు.