రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రక్షణ కార్యాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. ఆయనతో కాంటాక్టులోకి వచ్చినవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మీద జరుగుతున్న పోరాటంలో అగ్రభాగాన ఉంటున్న రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 1985 ఐఎఎస్ బ్యాచ్ అధికారి అయిన అజయ్ కుమార్ కరోనా వైరస్ సోకినట్లు సమాచారం.
దాంతో ఢిల్లీలోని రైసినా హిల్ కాంప్లెక్స్ లో గల సౌత్ బ్లాక్ కార్యాలయాన్ని మూసేశారు. కార్యాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. సౌత్ బ్లాక్ లోని కారిడార్స్ లో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు కార్యాలయానికి రాలేదు.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాత్ సింగ్ కూడా కార్యాలయానికి రాలేదని తెలుస్తోంది. కాంటాక్టులను గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యదర్శి అజయ్ కుమార్ తో గత రెండు రోజులుగా దాదాపు 30 మంది కాంటాక్టులోకి వచ్చినట్లు చెబుతున్నారు. వారిని హోం క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆదేశించారు.
జూన్ 1వ తేదీ వరకు అజయ్ కుమార్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. కరోనా వైరస్ కట్టడికి అనుసరించాల్సిన విధానాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరిస్తూ వెళ్లారు.