మిలిటరీ బలోపేతానికి డిఫెన్స్ మినిస్ట్రీ కీలక నిర్ణయం.. రూ. 7,523 కోట్లతో 118 యుద్ధ ట్యాంకులకు ఆర్డర్

By telugu teamFirst Published Sep 23, 2021, 9:16 PM IST
Highlights

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ దేశ మిలిటరీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ కోసం రూ. 7523 కోట్లతో 118 యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. అవది, చెన్నైలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్ పెట్టినట్టు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో దేశ ఉత్తర సరిహద్దులో ముప్పు పెరిగే అవకాశమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ(Defence ministry) కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక శక్తి(Military)ని మరింత బలోపేతం చేయడానికి యుద్ధ ట్యాంకుల(Main Battle Tank) కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 7,523 కోట్లతో 118 యుద్ధ ట్యాంకులను కొనుగోలు ఆర్డర్ పెట్టింది. అవది, చెన్నైలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ(హెచ్‌వీఎఫ్)లో అర్జున్(Arjun) ఎంకే-1ఏ యుద్ధ ట్యాంకుల కోసం ఆర్డర్(Order) పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా డిఫెన్స్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అర్జున్ ట్యాంక్‌లో సరికొత్త అంశాలతో రూపొందించిన కొత్త వేరియంటే ఎంబీటీ ఎంకే-1ఏ యుద్ధ ట్యాంక్. దీని ఫైర్ పైవర్, మొబిలిటీని మెరుగుపరచడంతోపాటు 72 కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, ఇందులో ఎక్కువగా దేశీయ మెటీరియల్ ఉపయోగించనున్నారు.

ఇండియన్ ఆర్మీ కోసం 118 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అర్జున్ ఎంకే-1ఏలను ఆర్డర్ చేసినట్టు మినిస్ట్రీ పేర్కొంది. అవది, చెన్నైలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీలో ఆర్డర్ పెట్టినట్టు తెలిపింది. రూ. 7,523 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌ మేక్ ఇన్ ఇండియా మిషన్‌ను మరింత బూస్ట్ చేస్తుందని వివరించింది. ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో అడుగు పడుతుందని తెలిపింది. ఈ ఆర్డర్ ఫలితంగా 200 ఎంఎస్ఎంఈలు సహా ఇతర సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించింది. సుమారు 8000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది.

ఈ మాడల్ ట్యాంక్‌ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసిందని పేర్కొంది. కచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఈ ట్యాంకులు పగలు, రాత్రిళ్లలోనూ సమర్థంగా పనిచేస్తాయి.

click me!