నరేంద్ర గిరి సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్: పోలీసులు రాకముందే ఉరితాడు నుంచి మృతదేహం తొలగింపు..

By telugu teamFirst Published Sep 23, 2021, 7:49 PM IST
Highlights

నరేంద్ర గిరి సూసైడ్‌లో అనూహ్య ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నరేంద్ర గిరి మరణించిన తర్వాత ఆయనను అదే గదిలో నేలపై పడుకోబెట్టిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియోలో క్రైమ్ సీన్‌లో వహించాల్సిన జాగ్రత్తలను తుంగలో తొక్కినట్టు తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకోక ముందే ఆయన మృతదేహాన్ని ఉరి తాడు నుంచి తొలగించినట్టు తేలింది. 
 

లక్నో: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి కేసులో మరో ఊహించని ట్విస్ట్ బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బాఘంబరి మఠంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడని వార్తలు వచ్చాయి. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యకు గురయ్యాడా? అనే అనుమానాలకు ఇంకా తెరపడలేదు. ఇదే కేసులో మరో అనూహ్య ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆయన మరణించిన తర్వాత మృతదేహాన్ని ఆయన నివసించిన గదిలో నేలపై పడుకోబెట్టినప్పుడు ఓ వ్యక్తి చిత్రించిన వీడియో కొత్త అనుమానాలు రేపుతున్నది.

ఆ వీడియోలో పోలీసులు సహా ఇతర ఆశ్రమ అధికారులు, నరేంద్ర గిరి శిష్యులు కనిపించారు. నరేంద్ర గిరి ఆరోపించిన నిందితులూ ఆ వీడియోలో కనిపించడం గమనార్హం. ఈ వీడియోలో పోలీసులు షూస్ ధరించి ఉన్నారు. ఇతరులూ నరేంద్ర గిరి మృతదేహం చుట్టూ గుమిగూడి కనిపించారు. సాధారణంగా ఒక క్రైమ్ సీన్‌ నుంచి ఆధారాలు సేకరించే వరకూ జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఇతరులకు ఘటనాస్థలిలోకి అనుమతించరు. కానీ, ఈ వీడియోలో నిందితులూ కనిపించడం అనుమానాలను రేకెత్తిస్తున్నది.

అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలు ఆ వీడియోలో వినిపించాయి. తాము రాకముందే నరేంద్ర గిరి మృతదేహాన్ని ఉరి తాడు నుంచి ఎందుకు తొలగించారని అడుగుతున్న మాటలు వినిపించాయి. అంటే, నరేంద్ర గిరి మృతదేహాన్ని ఆశ్రమంలోని వారే లేదా ఆయన శిష్యులే పోలీసులు రాకమునుపే ఉరి తాడు నుంచి కిందికి దించినట్టు తెలుస్తున్నది. దీన్ని కూడా చట్టం అంగీకరించదు.

నరేంద్ర గిరి ఉరేసుకున్నాడని చెబుతున్న ఫ్యాన్ తిరుగుతూనే కనిపించింది. నిజానికి ఆయన ఆత్మహత్య లేదా హత్యా కోణంలో ఫ్యాన్ కూడా ఒక ఎవిడెన్స్‌గా పనికి వచ్చేది. కానీ, మృతదేహాన్ని తొలగించిన తర్వాత యథావిధిగా ఫ్యాన్‌ను ఆన్ చేశారు. ఈ వీడియోలో ఫ్యాన్ తిరుగుతూనే ఉన్నది. ఆయన ఉరేసుకున్నట్టు చెబుతున్న నైలాన్ తాడునూ మూడు ముక్కలుగా కట్ చేశారు.

ఇలాంటి కొత్త కొత్త అనుమానాలు ఆయన కేసులో ఎన్నో ట్విస్టులను ఇస్తున్నాయి. దీనికితోడు నరేంద్ర గిరి మరణానికి పూర్వం ఒక వీడియో తీశాడన్న వార్త వచ్చింది. అందులో ఆయన తన మరణానికి కారకులుగా కొందరిని పేర్కొన్నారని, అవే పేర్లు సూసైడ్ లెటర్‌లోని పేర్లతోనూ సరిపోలినట్టు తెలిసింది.

click me!