
భోపాల్: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ రెండో వేవ్ ప్రజల ప్రాణాలు కబళిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి మరణించాడు. అప్పటి నిబంధనల ప్రకారం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. తామే అంతిమ క్రియలు నిర్వహించినట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు. కానీ, రెండేళ్ల తర్వాత ఆ వ్యక్తి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులు గుర్తు పట్టారు. కానీ, ఆ వ్యక్తి ఓ ఆందోళనకర విషయాన్ని వెల్లడించాడు.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల కమలేశ్ 2021లో కరోనా బారిన పడ్డాడు. అప్పుడు కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉచ్ఛ స్థితిలో ఉన్నది. చాలా మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయినట్టే కమలేశ్ కూడా మరణించాడని డిక్లేర్ చేశారు. అయితే, అప్పటి ఎస్‌వోపీ ప్రకారం కరోనాతో మరణించిన పేషెంట్ల మృతదేహాలను కుటుంబాలకు ఇవ్వలేదు. అధికారులే అంత్యక్రియలు నిర్వహించేవారు. కమలేశ్ మృతదేహానికీ అంత్యక్రియలు నిర్వహించినట్టు సివిక్ అధికారులు ఆ కుటుంబానికి తెలిపారు.
కమలేశ్ చనిపోయాడనే ఆ కుటుంబం నమ్మింది. రెండేళ్ల క్రితం నుంచి నేటి వరకు అదే నిజమని విశ్వసిస్తున్నది. కానీ, రెండేళ్ల క్రితం మరణించాడనుకున్న కమలేశ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. తాను మరణించలేదని కుటుంబానికి చెప్పాడు. తాను అహ్మదాబాద్‌లో ఓ గ్యాంగ్‌తో ఉన్నానని వివరించాడు. వారు ప్రతి రెండు రోజులకు ఒకసారి మత్తుపదార్థాలను తనకు ఇంజెక్ట్ చేశారని వాపోయాడు.
భార్య, కుటుంబ సభ్యులు కమలేశ్‌ను గుర్తించారు.
ధార్ జిల్లా అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.