
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల కస్టడీలో ఉండగానే మీడియాకు లైవ్‌లో సమాధానాలు ఇస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఆ ఇద్దరు స్పాట్‌లోనే మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు కమిటీ వేయాలని అధికారులకు సూచించారు. అలాగే, ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రయాగ్‌రాజ్‌లో అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ల హత్య జరగ్గానే ముఖ్యంగా యూపీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసులంతా అలర్ట్ మోడ్‌లో ఉన్నారు. అన్ని జిల్లాల్లో పోలీసులు నిఘా పెంచారు. సున్నితమైన ఏరియాల్లో పెట్రోలింగ్‌లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో అల్లర్లను ఎదుర్కొనే పోలీసులూ మోహరించారు. ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. ప్రొవిన్షయల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టబులరీ (పీఏసీ), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు.
అతీక్ సోదరుల హత్య తర్వాత సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసానికి భద్రతను పెంచారు.
ఈ హత్య జరిగిన తర్వాత కనీసం 17 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.