1984 సిక్కుల ఊచకోత కేసులో దోషికి ఉరిశిక్ష

By sivanagaprasad kodatiFirst Published Nov 21, 2018, 8:39 AM IST
Highlights

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇద్దరు సిక్కు యువకుల మృతికి కారణమైన యశ్‌పాల్‌సింగ్‌కు మరణశిక్షను, నరేశ్ షెరావత్‌కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న 1984 సిక్కుల ఊచకోత కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇద్దరు సిక్కు యువకుల మృతికి కారణమైన యశ్‌పాల్‌సింగ్‌కు మరణశిక్షను, నరేశ్ షెరావత్‌కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో.. ఇద్దరు సిక్కు అంగరక్షకుల చేతిలో దారుణహత్యకు గురయ్యారు. క్షణాల్లో ఈ వార్త దేశమంతా వ్యాపించింది.. ఆమె మరణానికి సిక్కులే కారణమని భావించిన కొందరు దేశరాజధానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే సిక్కులే లక్ష్యంగా దాడులకు దిగారు.

ఈ మారణహోమంలో అధికారికంగా 3 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. లెక్క తేలని వారు కూడా వేలల్లోనే ఉంటారని అంచనా. ఈ ఘటనలకు సంబంధించి 650 కేసులు నమోదయ్యాయి.

వీటిలో సరైన ఆధారాలు లేని కారణంగా చాలా కేసులను ఢిల్లీ పోలీసులు మూసివేయగా.. సాక్ష్యాధారాలు బలంగా ఉన్న 8 కేసుల్లో సిట్ ఛార్జి షీటు దాఖలు చేసింది. వీటిలో నరేశ్ షెరావత్, యశ్‌పాల్ సింగ్‌ల కేసు కూడా ఒకటి.. ఈ నెల 14న వారిద్దరిని దోషులుగా నిర్థారించిన న్యాయస్థానం... నిన్న తుది తీర్పును వెలువరించింది.

యశ్‌పాల్‌కు మరణశిక్షను విధించగా... నరేశ్ ఆరోగ్య పరిస్ధితిని పరిగణనలోకి తీసుకుని జీవితకాల శిక్షతో సరిపెట్టారు.. దీనితో పాటు దోషులిద్దరికీ చెరో రూ. 35 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ హైకోర్టు ధ్రువీకరించిన తర్వాత యశ్‌పాల్‌లకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ తీర్పు పట్ల సిక్కులు హర్షం వ్యక్తం చేశారు. 

click me!