రెండో పెళ్లి చేసుకున్న దావూద్ ఇబ్రహీం.. కరాచీలో డిఫెన్స్‌ ఏరియాకు నివాసం మార్పు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

By Sumanth KanukulaFirst Published Jan 17, 2023, 12:52 PM IST
Highlights

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దావూద్ ఇబ్రహీం మహిళను రెండో వివాహం చేసుకున్నాడని, కరాచీలోని డిఫెన్స్ ఏరియాలోకి నివాసానికి మార్చుకున్నట్టుగా తెలిసింది.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దావూద్ ఇబ్రహీం మహిళను రెండో వివాహం చేసుకున్నాడని, కరాచీలోని డిఫెన్స్ ఏరియాలోకి నివాసానికి మార్చుకున్నట్టుగా తెలిసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో దావూద్ ఇబ్రహీం దివంగత సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా ఇబ్రహీం పార్కర్ ఈ విషయాలను వెల్లడించాడు. దావూద్ ఇబ్రహీం రెండో భార్య పఠాన్ మూలానికి చెందినదని అలీషా తెలిపాడు. 

అలీషా వాంగ్మూలం ప్రకారం.. దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్య మెహజబీన్ షేక్‌కు ఇంకా విడాకులు ఇవ్వలేదు. 2022 జూలైలో తాను దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను దుబాయ్‌లో కలిశానని.. అప్పుడు దావూద్ రెండో వివాహం గురించి ఆమె తనకు చెప్పిందని అలీషా చెప్పాడు. దావూద్ మొదటి భార్య మెహజబీన్ షేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా భారతదేశంలోని దావూద్ బంధువులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలిపాడు. ఇక, 2022 సెప్టెంబర్‌లో ఎన్‌ఐఏ ముందు అలీషా ఇబ్రహీం ఈ విషయాలను వెల్లడించాడు. ఈ కేసుకు సంబంధించి ఏజెన్సీ కోర్టులో ఛార్జిషీట్‌ను కూడా సమర్పించింది.

ఇక, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహితులపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి కొందరిని అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం దేశంలోని బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఎన్ఐఏకు సమాచారం అందింది. వారు పెద్ద నగరాల్లో హింసను వ్యాప్తి చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ వాంగ్మూలాన్ని ఎన్ఐఏ నమోదు చేసింది.

హసీనా పార్కర్ గురించి..
షేక్ దావూద్ ఇబ్రహీం కస్కర్.. హాజీ మస్తాన్ గ్యాంగ్‌తో అండర్ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యాడు. తర్వాత ముంబై అండర్ వరల్డ్‌లో ఎదిగాడు. మస్తాన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. దావూద్ తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేశాడు. దావూద్ ప్రపంచంలోని అతిపెద్ద క్రైమ్ సిండికేట్‌లలో ఒకదానిని నడుపుతున్నాడు. 1993 ముంబై పేలుళ్లు, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలలో ఫైనాన్సింగ్, కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దావూద్ మహజబీన్ షేక్‌ను వివాహం చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు కుమార్తెలు-మహరుఖ్ ఇబ్రహీం, మెహ్రీన్ ఇబ్రహీం, మరియా ఇబ్రహీం, కుమారుడు మోయిన్ ఉన్నారు. మహరుఖ్ ఇబ్రహీం ప్రముఖ పాకిస్థానీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్‌ను వివాహం చేసుకుంది.

తన తోబుట్టువులు దేశం విడిచి పారిపోయిన తర్వాత హసీనా పార్కర్ ముంబైలోని దావూద్ క్రైమ్ సిండికేట్‌ను స్వాధీనం చేసుకుంది. ఆమె భర్తను దావూద్ ప్రత్యర్థి అరుణ్ గావ్లీ గ్యాంగ్ 1991లో హతమార్చింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు జేజే హాస్పిటల్ కాల్పులకు దారితీసింది. ఆమె 2014లో 55 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించింది. ఆమె జీవితం ఆధారంగా శ్రద్దా కపూర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ బయోపిక్ కూడా తెరకెక్కింది.

click me!