
న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో 48 ఏళ్ల మహిళ తన అత్తగారిని ప్రయింగ్ పాన్‌తో కొట్టి చంపింది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న 86 యేళ్ల వృద్ధురాలైన అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిందితురాలు విసుగు చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
ఏప్రిల్ 28న ఓ వ్యక్తి తన స్నేహితుడి తల్లి హసి సోమ్ ఫ్లాట్‌లో రక్తపు మడుగులు పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించాడు. సుర్జిత్ సోమ్ (51), అతని భార్య శర్మిష్ట సోమ్ (48) వారి 16 ఏళ్ల కుమార్తె 2014 నుండి నెబ్ సరాయ్‌లోని స్వస్తిక్ రెసిడెన్సీలో ఆమెతో కలిసి నివసిస్తున్నారు.
ఈ కుటుంబం స్వస్థలం కోల్‌కతా. కాగా, సుర్జిత్ సోమ్ తల్లి 2022, మార్చి వరకు పశ్చిమ బెంగాల్ రాజధానిలో ఒంటరిగానే నివసించింది. ఆ తరువాత ఆమెను ఢిల్లీకి తీసుకువచ్చారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆమెను తన సొంతింటికి ఎదురుగానే ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని అక్కడ ఉంచాడని అధికారి తెలిపారు.
విషాదం : బంధువు కర్మకాండకు వచ్చి.. క్వారీ గుంతలో మునిగి ముగ్గురు మృతి...
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న సమయానికి హాసి సోమ్ ముఖం, తలపై అనేక గాయాలతో వంటగదిలో పడి ఉందని తెలిపారు. తన తల్లి చాలా కాలంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతోందని, నడవడానికి కూడా ఇబ్బంది పడుతోందని సుర్జిత్ చెప్పాడు. బెడ్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరా ఉంది. అయితే అందులో మెమెరీ కార్డు లేదు. పోలీసులు ఆ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.
అయితే, సుర్జిత్ తన తల్లి దినచర్యను పర్యవేక్షించడం కోసం ఆ సీసీటీవీ కెమెరాను తన ఫోన్‌లోకి కనెక్ట్ చేసుకున్నాడు. దీంతో అతని ఫోన్ లో ఫీడ్ ఉందని చెప్పాడు. అయితే, ఘటన జరిగిన రోజు కరెంటు కట్ వల్ల కెమెరా పనిచేయలేదని పోలీసులకు తెలిపాడు. దీనిమీద మొదట్లో కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారికి ఎలాంటి అనుమానం రాలేదు.
మృతదేహాన్ని ఎయిమ్స్ మార్చురీకి తరలించి ఏప్రిల్ 29న శవపరీక్ష నిర్వహించారు. పోస్ట్‌మార్టం సమయంలో, సాధారణ పడిపోవడం వల్ల ఇలాంటి గాయాలు జరగవని డాక్టర్ అభిప్రాయపడ్డారని, సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరికి తెలిపారు.
తన తల్లి, అమ్మమ్మల మధ్య సత్సంబంధాలు లేవని సుర్జిత్ కూతురు చెప్పింది. సుర్జిత్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు ఫ్లాట్‌లో శర్మిష్ట మాత్రమే ఉంది. అయితే, ఘటన జరిగిన తరువాత.. పోలీసులు రావడానికి ముందు బాధితురాలి బెడ్‌రూమ్‌లో ఉంచిన సీసీటీవీ కెమెరా మెమరీ కార్డ్‌ను బయటకు తీసినట్లు సుర్జిత్ ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు.
ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సర్మిష్ట హాసి సోమ్ ఫ్లాట్‌లోకి ఫ్రైయింగ్ పాన్‌తో ప్రవేశించినట్లు సిసిటివి ఫుటేజీలో కనిపించింి. సీసీటీవీ కవరేజీ లేని వంటగదిలో ఉన్న బాధితురాలి వెనుకకు వెళ్లిన శర్మిష్ట.. ఆమెను ఫ్రైయింగ్ పాన్ తో చాలా దెబ్బలు కొట్టింది. ఈ సమయంలో సీసీటీవీ లో వృద్ధ మహిళ అరుపులు, ఏడుపులు కూడా రికార్డ్ అయ్యాయని చౌదరి తెలిపారు.
సుర్జిత్ తన తల్లి అంత్యక్రియల తర్వాత మెమరీ కార్డ్ లో ఫుటేజీని చూశాడు. సీసీటీవీ ఫుటేజీలో, తన భార్య.. తల్లి ఫ్లాట్‌లోకి ప్రవేశించి కాసేపటి తర్వాత బయటకు వెళ్లడం చూశాడు. దీంతో అనుమానం వచ్చి.. పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. పోలీసు అధికారి తెలిపారు.
సోమవారం పోస్ట్‌మార్టం నివేదిక వచ్చింది. తీవ్ర గాయాల కారణంగానే మృతి చెందినట్లు తేలింది. శవపరీక్ష నివేదిక ప్రకారం శరీరంలో మొత్తం 14 గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణలో వెలువడ్డ విషయాలు.. సుర్జీత్ వాంగ్మూలం, సీసీటీవీ ఫుటేజీ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి శర్మిష్టను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనలో వెంటనే తాము కారణం కనిపెట్టలేకపోయామని పోలీసులు చెప్పారు, అయితే వృద్ధురాలిని జాగ్రత్తగా చూసుకోవాల్సి రావడం, రోజువారీ దినచర్యలో ఆమెకు సహాయం చేయడంతో విసుగు చెందే శర్మిష్ట ఇలా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.