
ఢిల్లీ : రాఖీ కట్టడానికి తనకు సోదరుడు కావాలని కూతురు అడగడంతో ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. వచ్చే రక్షా బంధన్ పండుగ రోజున రాఖీ కట్టేందుకు తనకు సోదరుడు లేడని తమ కుమార్తె అడగడంతో.. నెల వయస్సు ఉన్న బాలుడిని కిడ్నాప్ చేశారో దంపతులు. ఈ దంపతులద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాగూర్ గార్డెన్‌లోని రఘుబీర్ నగర్‌లో నివాసముంటున్న సంజయ్ గుప్తా (41), అనితా గుప్తా (36) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. వీరి పెద్ద కుమారుడు (17) గతేడాది మృతి చెందినట్లు వారు తెలిపారు.
గురువారం తెల్లవారుజామున 4.34 గంటలకు ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వికలాంగ మహిళ నెలవయసు మగబిడ్డ కిడ్నాప్ అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఛట్టా రైల్ చౌక్ వద్ద ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న దంపతులు తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొన్నారు. లేచి చూస్తే తమ బిడ్డ కనిపించడం లేదని, ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
విచారణలో భాగంగా.. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలో ఇద్దరు బైక్‌పై తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 400 సిసిటివి కెమెరాలను తనిఖీ చేసి, వాటిని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి వరకు గుర్తించినట్లు అధికారి తెలిపారు.
ఆ తర్వాత, పోలీసులు అన్ని వివరాలను విశ్లేషించి ఆ బైక్ సంజయ్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినట్లు గుర్తించినట్లు అధికారి తెలిపారు. వెంటనే దాదాపు 15 మంది పోలీసులు ఆయుధాలతో ఆ ప్రాంతానికి వెళ్లారు. ఠాగూర్ గార్డెన్‌లోని రఘుబీర్ నగర్‌లోని సి-బ్లాక్‌కు వెళ్లారు. అక్కడ నిందితులైన దంపతులతో పాటు కిడ్నాప్‌కు గురైన బిడ్డ కనిపించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు.
సంజయ్, అనిత అనే ఆ దంపతుల 17యేళ్ల కొడుకు గత ఏడాది ఆగస్టు 17న టెర్రస్‌పై నుండి పడి చనిపోయాడు. వారికి15 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె ఈ సారి రక్షా బంధన్‌కు రాఖీ కట్టేందుకు తనకు సోదరుడు కావాలని అడిగిందని తెలిపారు. దీంతో తాము బాలుడిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఛట్టా రైల్ చౌక్ సమీపంలో వారు గాలిస్తుండగా.. తన తల్లికి కాస్త దూరంలో శిశువు నిద్రిస్తుండడం కనిపించింది. వెంటనే ఆ దంపతులు కిడ్నాప్ చేశారు. అతడిని తమ కొడుకులాగా చూసుకోవడానికి అతన్ని కిడ్నాప్ చేశామని తెలిపారు. వృత్తిరీత్యా టాటూ ఆర్టిస్ట్ అయిన సంజయ్ పై గతంలో మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అనిత మెహందీ ఆర్టిస్ట్ అని పోలీసులు తెలిపారు.