
చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావడం గొప్ప శాస్త్రీయ విజయంగా పాకిస్థాన్ అభివర్ణించింది. ఇస్రో శాస్త్రవేత్తలను అధికారికంగా ప్రశంసించింది. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన తరువాత ఆ దేశ మీడియా భారత్ ను పొగిడాయి. ధనిక దేశాల కంటే తక్కువ బడ్జెట్ లో ఈ ఘనత సాధించిన భారత్ పై దేశంలోని ప్రముఖ దినపత్రికలు ప్రశంసలు కురిపించాయి. కానీ ప్రభుత్వం ఇలా ప్రశంసించడం ఇదే మొదటి సారి.
చంద్రుడిపై చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావడంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ తాజాగా స్పందించారు. ‘‘ఇది గొప్ప శాస్త్రీయ విజయం అని మాత్రమే నేను చెప్పగలను, దీనికి ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు ప్రశంసలకు అర్హులు’’ అని ఆమె తన సంక్షిప్త ప్రతిస్పందనలో పేర్కొన్నారు. భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పాక్ ఇంతవరకు అధికారికంగా ప్రస్తావించలేదు. కానీ ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆ దేశ మీడియా మొదటి పేజీల్లో పతాక శీర్షికల్లో ఉంచింది.
‘‘భారత అంతరిక్ష అన్వేషణ’’ అనే శీర్షికన డాన్ పత్రిక తన సంపాదకీయంలో చంద్రయాన్ -3 మిషన్ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా పేర్కొంది. ధనిక దేశాలు భారీగా ఖర్చు చేసి సాధించిన దానిని భారత్ తక్కువ బడ్జెట్ లో సాధించడం అభినందనీయమని ఆ పత్రిక పేర్కొంది. భారత అంతరిక్ష కార్యక్రమం విజయవంతం కావడానికి, స్థిరమైన ప్రభుత్వ మద్దతుతో పాటు, ఈ క్లిష్టమైన మిషన్లను సుసాధ్యం చేయడంలో సహాయపడిన దాని ఇంజనీర్లు, శాస్త్రవేత్తల నాణ్యత, అంకితభావం కీలకమని వ్యాఖ్యానించింది.
అమెరికా, సోవియట్-రష్యా, చైనా అంతరిక్ష సంస్థలు చేయలేని పనిని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ చేయడంలో భారత్ ప్రతిష్టాత్మకమైన ప్రయోగం సాధించిందని ‘ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ వార్తాపత్రిక ‘ఇండియాస్ లూనార్ లారెల్’ అనే శీర్షికన తన సంపాదకీయంలో పేర్కొంది. అంతకు ముందు మాజీ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరీ కూడా భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
అయితే సోషల్ మీడియాలో చాలా మంది పాకిస్థానీలు కూడా భారత్ ను అభినందించారు. ఆ దేశానికి చెందిన వినియోగదారులు అంతరిక్ష అన్వేషణలో పాకిస్తాన్ పేలవమైన పనితీరును విమర్శించారు. 1961 లో ఏర్పాటు చేసిన స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ (సుపార్కో) అని పేరు గల అంతరిక్ష సంస్థపై సోషల్ మీడియాలో జోకులు పేల్చారు.