దళిత వరుడిని గుర్రంపై ఊరేగింపు: పోలీసుల రక్షణ

By narsimha lodeFirst Published Jul 18, 2021, 10:40 AM IST
Highlights


యూపీ రాష్ట్రంలో  దళిత వరుడు గుర్రంపై ఊరేగింపు సందర్భంగా పోలీసులు రక్షణ కల్పించారు. అగ్రవర్ణాల నుండి  బెదిరింపులున్న నేపథ్యంలో   రక్షణ కల్పించాలని వరుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఊరేగింపు సందర్భంగా రక్షణ కల్పించారు.

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ దళిత వరుడు  పోలీసుల సెక్యూరిటీ  మధ్య గుర్రం మీద ఊరేగింపులో పాల్గొన్నాడు. దళిత వరుడు సూరజ్ తండ్రి మంగేరామ్ సర్ధానా పోలీస్ స్టేషన్ లో గురువారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామమైన  మాన్‌పురిలో  అగ్రవర్ణాలు తమను బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వరుడిని గుర్రం మీద ఊరేగిస్తే చంపేస్తామని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  తమ కొడుకు గుర్రం మీద ఊరేగింపు సమయంలో  రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. అంతేకాదు గతంలో  కూడ తమ గ్రామంలో చోటు చేసుకొన్న ఘటనలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ విషయమై ఈ గ్రామానికి చెందిన అగ్ర కులానికి చెందిన  ఠాకూర్ కుటుంబాన్ని సర్ధానా పోలీస్ స్టేషన్ ఇంచార్జీ బ్రిజేష్ కుమార్ విచారించారు.దళిత వరుడు గుర్రంపై ఊరేగింపు చేయడాన్ని తాము వ్యతిరేకించలేదని ఠాకూర్ కుటుంబం చెప్పిందని పోలీస్ అధికారి బ్రిజేష్ తెలిపారు. తమ కుటుంబంలో ఇటీవలనే ఒకరు చనిపోయారని, ఈ కారణంగానే ఊరేగింపు సమయంలో  మ్యూజిక్ వద్దని తాము అభ్యంతరం చెప్పామని  ఠాగూర్ ఫ్యామిలీ చెప్పిందని పోలీసులు చెప్పారు.

తొలుత ఈ విషయాన్ని పోలీసులు చాలా తక్కువగా చూశారు. కానీ సాయంత్రంపూట ఊరేగింపు జరిగే సమయానికి  వరుడి ఇంటికి పోలీసులను పంపారు. అదే సమయంలో వధువు ఇంటికి వరుడు గుర్రంపై ఊరేగింపుగా బయలుదేరాడు. ఠాగూర్ కుటుంబం తమను పలుమార్లు ఇబ్బందులకు గురి చేసిందని వరుడి సోదరుడు   అంకిత్ మీడియాకు తెలిపారు. ఇదే గ్రామంలో తాము ఇంటిని నిర్మించుకొన్న సమయంలో కూడ అభ్యంతరం చెప్పారని ఆయన గుర్తు చేశారు.రోడ్డుపై భవన నిర్మాణ సామాగ్రి తీసుకురాకుండా ఇబ్బందులు పెట్టారన్నారు.

దళితుల ఇళ్లలో వివాహల సందర్భంగా నిర్వహించే బారాత్ ఊరేగింపు సమయంలో  అగ్రకులాలు అడ్డుకొన్న ఘటనలు తరచుగా చోటు చేసుకొంటున్నాయి.కసగంజ్ జిల్లాలో ఠాగూర్  ఫ్యామిలీ అధిపత్యం ఉన్న జిల్లాలో  27 ఏళ్ల దళిత యువకుడు రెండేళ్ల పాటు పోరాటం చేసి బారాత్ ఊరేగింపులో పాల్గొన్నాడు.

click me!