
పాట్నా; కల్తీ మద్యానికి 16మంది బలయిన సంఘటన బిహార్ లో చోటుచేసుకుంది. పశ్చిమచంపారన్ జిల్లాలో కేవలం నాలుగురోజుల వ్యవధిలోనే పలు గ్రామాల్లో 16మంది అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో ఈ మరణాలపై విచారణ చేపట్టిన అధికారులు కల్తీ మద్యం కారణంగానే మరణాలు చోటుచేసుకుంటున్నాయని ప్రాథమికంగా నిర్దారించారు.
చంపారన్ జిల్లాలోని జోగియా, ద్యురావా, బగాహీ గ్రామాల్లో ఒక్క శుక్రవారమే ఎనిమిది మంది మరణించారు. నాలుగురోజులుగా ఇవే గ్రామాల్లో మరో ఎనిమిది మంది కూడా చనిపోయారు. ఇలా రోజుల వ్యవధిలోనే 16మంది మృతిచెందడంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ గ్రామాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుందన్ కుమార్ ఆదేశించారు.
read more పీకలదాకా తాగి నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. రైల్వే సేవలకు అంతరాయం..!
రెండు మూడు రోజులుగా చాలా అనుమానాస్పద మరణాలు చోటుచేసుకుంటున్నట్లు తమకు సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మరణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ మరణాలకు గల కారణాలను త్వరలోనే తెలుసుకుంటామన్నారు. బాధిత గ్రామాల్లో మెడికల్ బృందం పర్యటిస్తుందని కలెక్టర్ కుందన్ కుమార్ తెలిపారు.
మరో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రి పాలవడంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం బాధిత గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇప్పటికే స్థానిక పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.