దళిత బాలుడు గుడిలో అడుగుపెట్టాడని అగ్రవర్ణాల ఆగ్రహం.. ఆ కుటుంబానికి రూ. 23వేల జరిమానా

Published : Sep 21, 2021, 05:15 PM IST
దళిత బాలుడు గుడిలో అడుగుపెట్టాడని అగ్రవర్ణాల ఆగ్రహం.. ఆ కుటుంబానికి రూ. 23వేల జరిమానా

సారాంశం

రెండేళ్ల దళిత బాలుడు హనుమాన్ ఆలయంలో అడుగుపెట్టాడని అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఆ కుటుంబంపై రూ. 23వేల జరిమానా విధించింది. దళిత బాలుడి ప్రవేశంతో ఆ గుడి అపవిత్రం చెందిందని వారు ఆరోపించారు. ఈ విషయం జిల్లా అధికారులకు తెలియడంతో ఆ ఊరిలో అంటరానితనంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  

బెంగళూరు: భారత సమాజం నుంచి అంటరానితనం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కొన్ని చోట్ల ఇప్పటికీ అగ్రవర్ణాల అహంకారానికి అవర్ణులు గురవుతూనే ఉన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా మారమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఇది ప్రబలంగానే కనిపిస్తున్నది. ఇందుకు నిదర్శనంగానే కర్ణాటకలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. కుల వ్యవస్థ గురించి ఏమాత్రమూ అవగాహన లేని రెండేళ్ల దళిత బాలుడు ఆత్రంగా హనుమంతుడి గుడిలో అడుగుపెట్టడం ఆ ఊరి ‘పెద్దల’కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే ప్రత్యేకంగా సమావేశమై సదరు దళిత కుటుంబంపై రూ. 23వేల జరిమానా విధించింది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా మియాపురాలో 4వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సెప్టెంబర్ 4న తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా దళిత కుటుంబానికి చెందిన రెండేళ్ల పిల్లాడు తండ్రితో కలిసి గుడికి వెళ్లారు. ఆ తండ్రి జాగ్రత్తతో ఇరువురూ గుడి బయటే దేవుడికి దండం పెట్టుకున్నారు. కానీ, ఆ పిల్లాడు వెంటనే ఆ హనుమాన్ గుడిలోకి పరుగెత్తాడు. దేవుడికి పూజించి మళ్లీ తిరిగివచ్చాడు.

ఈ విషయం తెలుసుకున్న అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఆగ్రహానికి గురై ఈ నెల 11న ఓ మీటింగ్ పెట్టుకున్నారు. సదరు దళిత బాలుడి ఆలయ ప్రవేశంతో గుడి అపవిత్రం చెందిందని భావించారు. ఆలయ పవిత్రతను పున:స్థాపించడానికి పూజలు చేయాలని, అందుకు రూ. 23వేల కావాలని ఆ దళిత కుటుంబాన్ని ఆదేశించారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు వెంటనే రంగంలోకి దిగి గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో అంటరానితనంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జరిమానా విధించిన వారిని మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలిపెట్టారు. నిందితులను హెచ్చరించామని, వారితో బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పించామని ఎస్పీ టీ శ్రీధర్ వివరించారు. వారిపై కేసు పెట్టాలని దళితులను అడగ్గా.. అది శత్రుత్వానికి దారి తీస్తుందని దళిత కుటుంబం చెప్పిందని తెలిపారు. దళిత కుటుంబానికి జరిమానా విధించడాన్ని అగ్రవర్ణాలకు చెందిన మరికొందరు వ్యతిరేకించారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu