ముంచుకొస్తున్న నివర్ : ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు మోడీ భరోసా

By Siva KodatiFirst Published Nov 24, 2020, 6:21 PM IST
Highlights

నివర్ తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయమైనా చేయడానికి సిద్ధంగా వున్నట్లు ప్రధాని హామీ ఇచ్చారు

నివర్ తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయమైనా చేయడానికి సిద్ధంగా వున్నట్లు ప్రధాని హామీ ఇచ్చారు.

అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్ధిస్తున్నట్లు ట్వీట్ చేశారు. నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను తమిళనాడుపై ఇప్పటికే పంజా విసురుతున్నది.

తుఫాను కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి  కురుస్తున్నది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుతున్నది.

పట్టాలం, మామల్లపురం, కరైకల్, సైదాపేట్, ఎగ్మూర్ తో పాటు.. ఇతర ప్రాంతాల్లోనూ వర్షం ఏకధాటిగా కురుస్తోంది ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

కాగా, ముందస్తు జాగ్రత్తగా తమిళనాడు తీరంలో రెండు కోస్ట్ గార్డ్ నౌకలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సముద్రం కల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సీఎం ఒక ప్రకటనలో కోరారు.
 

click me!