
Cyclone Mocha alert: మోచా సైక్లోన్ తీవ్ర తుఫానుగా మారి ఆదివారం బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలను తాకే అవకాశం ఉన్నందున పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల తీర ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ దళ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పుర్బా మేదినీపూర్ జిల్లాలోని దిఘా-మందర్మణి తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో డైవర్లతో సహా ఏడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలను మోహరించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బఖాలీ సముద్ర తీరంలో పర్యాటకులు, స్థానికుల కదలికలపై నిఘా ఉంచేందుకు 100 మందికి పైగా రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు.
తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో రెండు జిల్లాల్లోని తీర ప్రాంత వాసులను ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సుందర్బన్స్ లో కరకట్టల పగుళ్లను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తుండగా, మధ్యాహ్నం సమయంలో ప్రజలు సముద్రం దగ్గరకు వెళ్లకుండా పోలీసులు, అధికార యంత్రాంగం లౌడ్ స్పీకర్లను వినియోగిస్తూ.. ఇతర సహాయక సన్నద్ద చర్యలు చేపట్టాయి. మోచా తుఫాను పశ్చిమ బెంగాల్ ను దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, ఏదైనా మార్పు వస్తే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. పుర్బా మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల్లోని లోతట్టు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామనీ, ఈ ప్రాంతాలకు తగిన సహాయ సామగ్రిని పంపామని మరో అధికారి తెలిపినట్టు పీటీఐ నివేదించింది.
శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. పగటిపూట అత్యంత తీవ్రమైన తుఫానుగా మోచా సైక్లోన్ దక్షిణ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ ను దాటే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్ లో పేర్కొంది. కాగా, మోచా తుఫాను ముంచుకొస్తున్న తరుణంలో బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ లో 1,90,000 మందిని, చిట్టగాంగ్ లో దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు డివిజనల్ కమిషనర్ అమీనుర్ రెహ్మాన్ తెలిపారు. బంగ్లాదేశ్ లో దాదాపు 12 అడుగుల ఎత్తు వరకు తుఫాను ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తాయని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని సమాచారం. మయన్మార్ అధికారులు రఖైన్ తీరం వెంబడి ఉన్న గ్రామాలను కూడా ఖాళీ చేయించారు.
మయన్మార్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ సోమవారం వరకు రఖైన్ రాష్ట్రానికి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే, మయన్మార్ రెడ్ క్రాస్ సొసైటీ "భారీ అత్యవసర ప్రతిస్పందనకు సిద్ధం అవుతోంది" అని తెలిపింది. ప్రమాదకర ప్రాంతాల నుంచి రోహింగ్యా శరణార్థులను కమ్యూనిటీ సెంటర్లకు, పాఠశాలలు వంటి పటిష్టమైన నిర్మాణాలకు తరలించేందుకు బంగ్లాదేశ్ అధికారులు చర్యలు చేపట్టారు. సిద్ర్ తుఫాన్ తర్వాత మోచా తుఫాను అత్యంత శక్తివంతమైన తుఫాను అని బంగ్లాదేశ్ వాతావరణ శాఖ అధిపతి అజీజుర్ రెహ్మాన్ తెలిపారు. బంగ్లాదేశ్ లోని అతిపెద్ద ఓడరేవు చిట్టగాంగ్ లో కార్యకలాపాలను నిలిపివేశారు. బోటు రవాణా, చేపల వేట కూడా నిలిచిపోయాయి.