బంగాళాఖాతంలో మాండౌస్ తుఫాన్.. ప‌లు రాష్ట్రాలకు భారీ వర్షపాతం : ఐఎండీ

Published : Dec 06, 2022, 10:50 PM IST
బంగాళాఖాతంలో మాండౌస్ తుఫాన్..  ప‌లు రాష్ట్రాలకు భారీ వర్షపాతం :  ఐఎండీ

సారాంశం

New Delhi: బంగాళాఖాతంలో మాండౌస్ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్ర‌మంలో ప‌లు రాష్ట్రాలు భారీ వర్షపాతం పొందుతాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్ల‌డించింది. మాండౌస్ తుఫానుపై మంగళవారం నాడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

India Meteorological Department: బంగాళాఖాతంలో ఉష్ణమండల వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందనీ, దీని వ‌ల్ల తుఫాను ఏర్ప‌డ‌టం  కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) అంచ‌నా వేసింది. రాబోయే మాండౌస్ తుఫాను గురించి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా మంగళవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా ఉంది. ఇది మంగళవారం సాయంత్రానికి పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

ఆ తర్వాత, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ, క్రమంగా తుఫానుగా మారి, డిసెంబర్ 8 ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి & ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని వాతావర‌ణ విభాగం అంచ‌నా వేసింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానును ఎదుర్కొనేందుకు రాష్ట్రం పూర్తిగా సన్నద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి తెలిపారు. దక్షిణ ఆంధ్రాలోని ప్రధాన నాలుగు జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురంతో పాటు సమీపంలోని మరో రెండు జిల్లాలపై ప్రభావం పడుతుందని జవహర్ రెడ్డి తెలిపారు. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. బలహీనమైన డ్యామ్‌లు, రిజర్వాయర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం 11 ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, 10 ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.

 

తుఫాను దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఎవరైనా ఇప్పటికే సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఉంటే వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మూడు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలిపారు. తుఫాను ముందస్తు ప్రణాళిక ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉండాలని మూడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను రాజీవ్ గౌబా ఆదేశించారు.
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?