
న్యూఢిల్లీ: బిపర్‌జోయ్ తుపాను గుజరాత్‌లో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. తీరంలో అలలు భారీ ఎత్తున ఎగడిపడుతున్నాయి. గురువారం రాత్రి బిపర్‌జోయ్ తుపాను కచ్ జిల్లాలో తీరం దాటింది. తుఫాను పరిస్థితిని సమీక్షించేందుకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. బిపర్‌జోయ్ తుపాన్ తీరం దాటిన తర్వాత గుజరాత్‌లో నెలకొన్న పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మంత్రి ఆరా తీశారు.
ఈ మేరకు ప్రధాని మోదీ గురువారం రాత్రి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాన్ ప్రభావంతో పాటుగా వన్యప్రాణులు, ముఖ్యంగా గిర్ అడవుల్లోని సింహాల భద్రత కోసం రాష్ట్ర యంత్రాంగం తీసుకున్న చర్యలను ప్రధాని ఆరా తీశారు. ‘‘ప్రధాని మోదీ నాతో టెలిఫోనిక్ సంభాషణ జరిపారు. బిపర్‌జోయ్ తుపాను ధాటికి గుజరాత్ ప్రస్తుత పరిస్థితి గురించి అన్ని వివరాలను తీసుకున్నారు. గిర్ ఫారెస్ట్‌లోని సింహాలతో సహా అన్ని వన్యప్రాణుల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన ఆరా తీశారు’’ అని భూపేంద్ర పటేల్ ట్వీట్ చేశారు.
ఇక, బిపర్‌జోయ్ తుపాను గురువారం గుజరాత్‌లో విధ్వంసం సృష్టించడంతో ఇద్దరు వ్యక్తులు (వరదల కారణంగా లోయలో చిక్కుకున్న మేకలను కాపాడేందుకు వెళ్లిన తండ్రీకొడుకులు) మరణించారు. 22 మంది గాయపడ్డారు, చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షాలు, గాలులకు అనేక వాహనాలు, ఇళ్ళు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బిపర్‌జోయ్ తుపాన్ రాజస్థాన్ దిశగా కదులుతుంది. ఈ సాయంత్రం తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
బిపర్‌జోయ్ తుపాన్ వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. ఇక, అధిక వేగంతో వీస్తున్న గాలులు, అలలు, భారీ వర్షాల కారణంగా తాత్కాలిక గృహ నిర్మాణాలకు భారీ నష్టం జరగడంతోపాటు చెట్లు, కొమ్మలు కూలిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.