
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఐదుగురు విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుప్వారా వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) విజయ్ కుమార్ తెలిపారు.
‘‘నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిపై భద్రతా బలగాలకు నిర్దిష్ట సమాచారం అందింది. దీంతో ఆర్మీ, పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇక, కుప్వారా సెక్టార్ నుంచి కాశ్మీర్‌లో ఈ ఏడాది చొరబాటుకు ఇది మొదటి పెద్ద ప్రయత్నంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 13న కుప్వారా జిల్లా సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.