
న్యూఢిల్లీ: బిపర్‌జోయ్ అత్యంత తీవ్ర తుపాన్‌గా మారి పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ సాయంత్రం కచ్ జిల్లాలో బీపర్జోయ్ తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున దాదాపు 74,000 మందిని గుజరాత్ తీర ప్రాంతం నుండి షెల్టర్లకు తరలించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు.ప్రస్తుతం బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరానికి 200 కి.మీ కంటే తక్కువ దూరంలో ఉంది. బిపర్‌జోయ్ తుఫాన్ జూన్ 15న తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జఖౌ పోర్ట్ (గుజరాత్) నుంచి పశ్చిమ-నైరుతి దిశలో 200 కి.మీల దూరంలో ఉంది.
బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ తీరంలోని జాఖౌ నౌకాశ్రయానికి సమీపంలో సాయంత్రం 4-8 గంటల మధ్య దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీతెలిపింది. కేటగిరీ 3కి చెందిన చాలా తీవ్రమైన తుపానుగా వర్గీకరించబడిన బిపర్‌జోయ్ ప్రభావంతో గరిష్టంగా గంటకు 115-125 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యాహ్నం గాలి వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది.
కచ్, దేవభూమి ద్వారకా, జామ్‌నగర్ జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాలతో బిపార్జోయ్ తుఫాను తీరాన్ని సమీపించే కొద్దీ వర్షాల తీవ్రత పెరుగుతుందని వాతావరణ కార్యాలయం తెలిపింది. కచ్ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 10 కి.మీ పరిధిలో ఉన్న ఉన్న దాదాపు 120 గ్రామాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో తుపాను సంసిద్ధతను సమీక్షించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన ఈరోజు సమావేశం జరిగింది. కచ్, జామ్‌నగర్, మోర్బీ, రాజ్‌కోట్, దేవభూమి ద్వారక, జునాగఢ్, పోర్‌బందర్, గిర్ సోమనాథ్‌లోని ఎనిమిది తీరప్రాంత జిల్లాల్లో ఇప్పటివరకు 74,345 మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) 18 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్) 12 బృందాలు, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన 397 బృందాలు వివిధ తీరప్రాంత జిల్లాల్లో మోహరించబడ్డాయి.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌లతో సహా అన్ని సాయుధ బలగాలు గుజరాత్ స్థానిక ప్రజలకు సహాయం అందించేందుకు అవసరమైన సన్నద్ధం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బిపర్‌జోయ్ తుపాన్ నేపథ్యంలో రేపు (జూన్ 16) వరకు చేపల వేట కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారినందున ఓడరేవులు మూసివేయబడ్డాయి. తుపాన్ సమీపిస్తున్న కారణంగా ఈ ప్రాంతంలో చాలా భారీ వర్షాలు, బలమైన గాలులతో వాతావరణం ప్రతికూలంగా మారింది.
బిపర్‌జోయ్ తుపాన్ ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యగా 76 రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. గుజరాత్‌లోని రెండు ప్రసిద్ధ ఆలయాలు.. దేవభూమి ద్వారకలోని ద్వారకాధీష్ ఆలయం, గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయాలల్లోకి భక్తులకు అనుమతి లేకుండా మూసివేయబడ్డాయి.
తీర ప్రాంతంలో ఆటుపోట్ల కంటే దాదాపు 2-3 మీటర్ల ఎత్తులో తుఫాను ఉప్పెన వల్ల ల్యాండ్ ఫాల్ కారణంగా ప్రభావితమయ్యే జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అలలు 3-6 మీటర్ల వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 2021లో 'తౌక్టే' తర్వాత రెండేళ్లలో రాష్ట్రాన్ని తాకిన రెండో తుఫాను ఇది.