
నేరాల దర్యాప్తును మరింత వేగవంతం చేయడంతో పాటు శిక్షా రేటును పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. ఈ క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్లు -2022 పై నిన్న రాజ్యసభలో చర్చ జరిగింది. అయితే ఇందులో ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన సందేహాలకు కేంద్ర హోం మంత్రి సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. నేరాల రేటును తగ్గించడం, నేరస్థుల శిక్షా రేటును పెంచడం, దేశ భద్రతను పెంచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ బిల్లు ఏ వ్యక్తి గోప్యతకూ భంగం కలిగించదని స్పష్టం చేశారు. సరైన పరిశీలన తర్వాత చట్టంలోని నిబంధనలను వివరిస్తామని మంత్రి చెప్పారు. ఈ బిల్లు నేరాల బాధితుల మానవహక్కులను పరిరక్షిస్తుందని తెలిపారు.
‘‘ ఇతర దేశాలతో పోలిస్తే మనం రూపొందించిన చట్టం ‘బచ్చా’ (చాలా చిన్నది). దక్షిణాఫ్రికా, UK, ఆస్ట్రేలియా, కెనడా, US వంటి దేశాల్లో మరింత కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. అందుకే వారి నేరారోపణ రేటు మెరుగ్గా ఉంది’’ అని కేంద్ర హోం మంత్రి తెలిపారు. “ బిల్లులోని నిబంధనలను దుర్వినియోగం చేయాలనే ఉద్దేశ్యం మాకు లేదు. ఇది మన పోలీసులను ఎంతగానో ఉపయోగపడుతుంది. నేరస్తుల కంటే పోలీసులను ముందంజలో ఉంచడానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది’’ అని అమిత్ షా అన్నారు.
వచ్చే తరంలో నేరాలను పాత పద్ధతులతో పరిష్కరించలేమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నేర, న్యాయ వ్యవస్థను తదుపరి యుగానికి తీసుకెళ్లేందుకు మనం ఇప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాలని తెలిపారు. అయితే కొత్త చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని విపక్షాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు అమిత్ షా ప్రయత్నించారు.
‘‘ నేరస్థుల నుంచి సేకరించిన డేటాను భద్రపరచడానికి అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగిస్తాము. వీటిని నిర్వహించే వారికి మంచి శిక్షణ ఉంటుంది. నేరస్థుల శరీర కొలతలు (వేలు ముద్రలు, అరచేతి ముద్ర, పాద ముద్ర, ఫొటోలు, ఐరిస్, రెటీనా స్కాన్, ఫిజికల్, బయోలాజికల్ నమునాలు) తీసుకోవడానికి ఈ బిల్లు చట్టపరమైన అనుమతిని అందిస్తుంది. దీంతో నేర పరిశోధనన మరింత వేగవంతంగా, సమర్థవంతంగా తయారవుతుంది’’ అని అమిత్ షా చెప్పారు.
రాజ్యసభ బుధవారం ఆమోదించిన బిల్లును ఏప్రిల్ 4వ తేదీన లోక్ సభ ఆమోదించింది. ఈ బిల్లు నేరస్థుల శరీర కొలతలను సేకరించడానికి, నిల్వ చేయడానికి, ఈ డేటాను ఇతర దర్యాప్తు సంస్థలతో పంచుకోవడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి అధికారం కల్పిస్తుంది. ఏ వ్యక్తినైనా కొలతలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడానికి మేజిస్ట్రేట్‌కు అధికారం ఇస్తుంది. ఎవరైనా కొలతలు ఇవ్వడానికి నిరాకరించిన వారివి కూడా తీసుకునేందుకు జైలు అధికారులకు అధికారం ఉంటుంది. ఈ బిల్లుపై చర్చలో మొత్తం 17 మంది సభ్యులు పాల్గొన్నారు. అయితే కొందరు ప్రతిపక్ష సభ్యులు ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దానిని సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచించారు.