
dwindling food stocks: దేశంలో ఆహార నిల్వలు తగ్గిపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. భారత్ నేడు తీవ్రమైన ఆహార సంక్షోభం వైపు పయనిస్తోందనీ, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలే కారణమని తీవ్రస్థాయిలో మండిపడింది. దేశంలో తగ్గుతున్న ఆహార నిల్వలు 15 ఏళ్ల కనిష్టానికి, తలసరి అంశాల పరంగా 50 ఏళ్ల కనిష్టానికి చేరుకున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పేర్కొంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది. కొత్తగా నియమితులైన కిసాన్ కాంగ్రెస్ చీఫ్ సుఖ్‌పాల్ ఖైరా మాట్లాడుతూ.. పండించిన పంటకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని నిర్ధారించడానికి వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మోడీ సర్కారు వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు పెద్దఎత్తున ఉద్యమించడంతో వాటిని ఉపసంహరించుకున్నారు.
మోడీ ప్రభుత్వం "రైతు వ్యతిరేక" విధానాలను అవలంబిస్తున్నదని కాంగ్రెస్ నాయకులు ఖైరా, మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరాలు అన్నారు. గోధుమ ఉత్పత్తి తగ్గినందున గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గోధుమ కేటాయింపులను ఎలా తగ్గింపు చర్యలు చేపట్టిందనే విషయాన్ని వెల్లడించారు. వరి సాగు విస్తీర్ణం తగ్గించాలని చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రాలు వరి ఉత్పత్తిని పెంచాలని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ గట్టిగా కోరుతుండగా, రైతులు ఎరువుల కొరతతో సతమతమవుతున్నారని అన్నారు. అలాగే, ఎరువుల ధరలు సైతం పెరిగిపోతున్నాయని ఖైరా పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్న మోడీ సర్కారు.. తన బిలియనీర్ స్నేహితులక కోసం బ్యాక్ డోర్ నుంచి వారికి లాభం చేకూరుస్తూ.. రైతుల నోట్లో మట్టికొట్టే విధానాలతో ముందుకు సాగుతున్నదనే ఆరోపించారు.
తమ సహేతుకమైన డిమాండ్లను అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం నిరాకరించినందుకు వ్యతిరేకంగా 500 జిల్లాల్లో నిరసన చేపట్టాలనే SKM నిర్ణయానికి ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇందులో కనీస మద్దతు ధరల (MSP) చట్టపరమైన హామీని అమలు చేయడానికి వెంటనే ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయడం వంటి పలు డిమాండ్లు ఉన్నాయని ఖైరా తెలిపారు. ప్రభుత్వం ఏదో ఒక సాకుతో కాలయాపన చేస్తున్నదని అన్నారు. రైతులపై తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలన్న ఎస్‌కెఎం డిమాండ్‌కు పార్టీ మద్దతు ఇస్తుందని, దాని కోసం ఇంకా చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. అన్ని హామీలకు విరుద్ధంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తున్న కఠినమైన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌కు కూడా మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
యువజన వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తిపలకాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే, లఖింపూర్ ఖేరీ సంఘటనపై కేంద్ర మంత్రివర్గం నుండి అజయ్ మిశ్రా తేనిని తొలగించాలని కూడా డిమాండ్ చేసింది. స్వామినాథన్ కమీషన్ నివేదికను అమలు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా రైతులు, భూమిలేని కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎత్తిచూపింది. వాటి పరిష్కారినికి చర్యలు తీసుకోవాలంది.