
తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత రెండు నెలల్లో 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసినట్లు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇందులో 89 లైసెన్సులు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తుల పేర్లతో జారీ అయ్యాయని వెల్లడించింది.
గన్ కల్చర్, హింసను ప్రోత్సహించే పాటలు,ఆయుధాల బహిరంగ ప్రదర్శనను ఆప్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో నిషేధించింది. అలాగే.. రాష్ట్రంలో జారీ చేసిన అన్ని ఆయుధ లైసెన్స్‌లను తనిఖీ చేయాలని ఆదేశించారు. పంజాబ్ ప్రభుత్వం రద్దు చేసిన 813 ఆయుధ లైసెన్సుల్లో.. లూథియానా రూరల్‌లో 87, షహీద్ భగత్ సింగ్ నగర్‌లో 48, గురుదాస్‌పూర్‌లో 10, ఫరీద్‌కోట్‌లో 84, పఠాన్‌కోట్‌లో 199, హోషియార్‌పూర్‌లో 47, కపుర్తలాలో 6, సంగర్‌పూర్‌లో 235 లైసెన్స్‌లను ప్రభుత్వం రద్దు చేసింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటి వరకు 2000కి పైగా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసిందని చెబుతున్నారు.
3.73 లక్షలకు పైగా ఆయుధ లైసెన్స్‌లు
పంజాబ్ రాష్ట్రంలో 3.73 లక్షలకు పైగా ఆయుధాల లైసెన్స్‌లు ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది. గురుదాస్‌పూర్ జిల్లాలో గరిష్టంగా 40,789 లైసెన్స్‌లను జారీ చేయగా.. బటిండాలో 29,353, పాటియాలాలో 28,340, మోగాలో 26,756, అమృత్‌సర్ (రూరల్)లో 23,201, ఫిరోజ్‌పూర్‌లో 21,432 లైసెన్స్‌లు జారీ చేయబడ్డాయి. ఆప్ ఎమ్మెల్యే ఇంద్రజిత్ కౌర్ మాన్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ సమాచారం ఇచ్చింది.