
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారులపై విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించండి, మోడీని ఓడించండి అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. అయితే ఏపీలో మాత్రం ‘‘మోడీ, జగన్ హటావో’’ పేరుతో కార్యక్రమాలు చేపడతామని నారాయణ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లు రహస్య బంధం కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. మోడీకి జగన్ అడుగడుగునా అండగా వున్నారని ఆయన దుయ్యబట్టారు.
జగన్ చరిత్ర, దుర్యోధనుడి చరిత్ర ఒకటేనని.. జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికిపైగా సలహాదారులు వున్నారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని.. బంకర్లలో కూర్చుని జగనన్నకు చెప్పండి అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. రాజన్న పేరు చెప్పి ఆయనకు సీఎం మూడు నామాలు పెడుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీతో సయోధ్య వున్న పార్టీలతో జతకట్టేది లేదని.. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వాలు కొంటామని ముందుకు వస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read: ఎయిర్ బర్డ్స్ కోసం గంజాయి మత్తులో హత్య... జగన్ సర్కార్ పై చంద్రబాబు గరం
అదానీ మోసాలను అమెరికా సంస్థ బయట పెట్టిందని.. మోడీ సహకారంతోనే అదానీ ఈ స్థాయికి చేరుకున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. మోడీ-అదానీ బంధాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి, అనర్హత వేటుకు గురిచేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి 30 మంది దత్తపుత్రులు వున్నారని.. వారంతా దేశాన్ని దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో గెలుపు కోసం మోడీ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు.