
కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఏర్పాటు కోసం జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ ఈరోజు భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి కొద్ది రోజుల ముందు నితీశ్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లు.. కోల్‌కత్తా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసిన సంగతి తెలిసిందే. అయితే అంతకు దాదాపు నెలరోజుల ముందే నవీన్ పట్నాయక్‌తో మమతా బెనర్జీ సమావేశమయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్‌ల మధ్య భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరు నేతలు కూడా చాలా కాలంగా స్నేహితులుగా ఉన్న పక్షంలో.. ఈ భేటీ వ్యక్తిగతంగా జరిగిందని అంటున్నారు. ఈ భేటీలో అలియన్స్‌పై ఎలాంటి చర్చలు జరగలేదని పట్నాయక్ నవీన్ పట్నాయక్ చెప్పారు.
‘‘మాది అందరికి తెలిసిన స్నేహమే. మేము చాలా సంవత్సరాల క్రితం సహచరులం. ఈ రోజు ఎలాంటి పొత్తులపై చర్చ జరగలేదు’’ అని నవీన్ పట్నాయక్ సమావేశం అనంతరం తెలిపారు. ఇక, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్‌లు.. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్‌లో సహచరులుగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక, నవీన్ పట్నాయక్ సాధారణంగా బీజేపీ లేదా కాంగ్రెస్‌కు సమాన దూరం పాటిస్తూ వస్తున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని చూస్తారు. అయినప్పటికీ పార్లమెంటులో అనేక ముఖ్యమైన బిల్లులకు సంబంధించి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
మరోవైపు మే 18న ఢిల్లీలో ప్రతిపక్ష నేతలందరితో భారీ సమావేశానికి నితీష్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రేపు జార్ఖండ్ వెళ్లి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ హేమంత్ సోరెన్‌ను కలవనున్నారు. అలాగే గురువారం ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేలను కూడా కలవనున్నారు.