COVID-19- India: దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా, తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్ లు ఉన్నాయి.
COVID-19 India News Updates: భారత్‌లో కరోనా వైరస్ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఒమిక్రాన్ కు చెందిన మరో కొత్త సబ్ వేరియంట్‌ను భారత్ లో గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించిన క్రమంలో కేసులు, మరణాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ లో కోవిడ్-19 కేసులు మళ్లీ అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 18,840 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా వైరస్ తో పోరాడుతూ 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ మహమ్మారి కేసుల సంఖ్య 4,36,04,394 కు చేరింది. అలాగే, కోవిడ్-19తో చనిపోయిన వారి సంఖ్య 5,25,386కు పెరిగింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం (జూలై 9) పంచుకున్న డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశం మొత్తం 16,104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు సుమారు 98.51 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 4,29,53,980 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కోవిడ్-19 యాక్టివ్ కేసులు 1,25,028కి పెరిగాయని మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది. యాక్టివ్ కోవిడ్-19 కాసేలోడ్‌లో 24 గంటల వ్యవధిలో 2,693 కేసులు పెరిగాయి. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.29 శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జూలై 9న రోజువారీ సానుకూలత రేటు 4.14 శాతంగా నమోదైంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్‌లో ఉండగా, తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్ లు ఉన్నాయి. కొత్తగా నమోదైన కరోనా కేసులు అధికంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, కర్నాటకలో నమోదయ్యాయి. కొత్త మరణాల్లో అధికంగా కేరళలో 19, మహారాష్ట్రలో ఏడుగురు చనిపోయారు.
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/2yc8qHQsem pic.twitter.com/sYhl5mEWuR
దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్-19 పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం.. జూలై 8 వరకు 86,61,77,937 కరోనా వైరస్ నమూనాలను పరీక్షించారు. శుక్రవారం వారం ఒక్కరోజే 4,54,778 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 198.7 కోట్ల కరోనా వైరస్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 91.8 కోట్లుగా ఉండగా, రెండు డోసులు అందుకున్న వారి సంఖ్య 84.7 కోట్లుగా ఉందని ప్రభుత్వ డేటా పేర్కొంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు.