Coronavirus: పలు దేశాల్లో మళ్లీ కరోనావైరస్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కోవిడ్-19 ఉప్పెనకు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్ లోనూ వెలుగుచూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను సైతం అలర్ట్ చేస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
పొరుగున ఉన్న చైనాలో పెరుగుతున్న కేసుల మధ్య ఏదైనా కోవిడ్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధతలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు తాజాగా ప్రధాన ఆరు పాయింట్ల అంశాలను ప్రస్తావిస్తూ పలు సలహాలు ఇచ్చింది. చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్.7 వేరియంట్ తరహా కేసులు దేశంలో గుర్తించిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.
రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి..
- ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలోనే కోవిడ్-19కు సంబంధించి పలు సూచనలు చేస్తూ లేఖ రాసింది.
- చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
- చైనా సహా పైన పేర్కొన్న నాలుగు దేశాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు కనిపించినా, పాజిటివ్ వచ్చినా వారిని క్వారంటైన్లో ఉంచుతామని ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
- 2021 మధ్యలో భారతదేశంలో రెండవ వేవ్ ప్రారంభ రోజుల్లో ఆక్సిజన్ కొరత మొదట్లో పెద్ద సమస్యగా మారింది. ఆ సమయంలో ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
- దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి పెరగడం లేదు, కానీ భవిష్యత్తులో తలెత్తే ఏవైనా సవాళ్లను ఎదుర్కోవటానికి, ఈ వైద్య మౌలిక సదుపాయాల నిర్వహణ, కల్పన చాలా ముఖ్యం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
- మెడికల్ ఆక్సిజన్ నిర్వహణపై ప్రభుత్వ తాజా సలహా ప్రకారం, పీఎస్ఏ ప్లాంట్లు పూర్తిగా పనిచేయాలి. వాటిని తనిఖీ చేయడానికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ చేయాలి.
- వైద్యారోగ్య కేంద్రాల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ లేదా ఎల్ఎంవో లభ్యత, వాటి రీఫిల్లింగ్ కోసం నిరంతరాయ సరఫరా గొలుసు ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి.
- ఆక్సిజన్ సిలిండర్ల ఇన్వెంటరీతో పాటు బ్యాకప్ స్టాక్స్, బలమైన రీఫిల్లింగ్ వ్యవస్థను నిర్వహించాలని కేంద్రం పేర్కొంది. ప్రతి ఆదివారం ఆక్సిజన్ లభ్యతపై సమీక్షలు నిర్వహించాలని సూచించింది.
- చైనా, ఇతర ప్రాంతాల్లో కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న దృష్ట్యా భారతదేశం ఇప్పటివరకు కోవిడ్ కేసుల జన్యుక్రమాన్ని వేగవంతం చేసింది. ప్రతి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు జీనోమ్ సిక్వెన్సింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
- కాగా, ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కోట్లాది కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో యావత్ ప్రపంచం మళ్లీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల నేపథ్యంలో చాలా దేశాలు అప్రమత్తమయ్యాయి.
- లాక్ డౌన్లు, నిర్భంధాలు, సామూహిక పరీక్షలు వంటి చర్యలను చైనా ఎత్తివేసిన తర్వాత మళ్లీ కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోగులతో అక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నాయి.
- కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు, చైనాలో తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న వేరియంట్ల దృష్ట్యా ఈ వ్యాప్తి ఇప్పుడు మిగిలిన ప్రపంచానికి ఆందోళన కలిగిస్తుందని యునైటెడ్ స్టేట్స్ హెచ్చరించింది.
- మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పుడు తీవ్రంగా దెబ్బతిన్న భారతదేశం, ఇప్పటివరకు కేసులలో గణనీయమైన పెరుగుదలను నివేదించలేదు. కానీ, ఇతర దేశాల్లో కరోనా ఉద్ధృతికి కారణమైన వేరియంట్లు భారత్ లోనూ గుర్తించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.