
గువహతి: సంతాన సమస్య కారణంగా ఓ మహిళ హత్య జరిగింది. తమ బిడ్డకు సంతానం లేదని, ఒక పాపను ఆమెకు అందించాలని ఆ దంపతులు అనుకున్నారు. ఇందుకోసం వారు నేరమార్గాన్ని ఎంచుకున్నారు. అసోంలో ఓ మహిళను చంపేసి ఆమె పాపను కిడ్నాప్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తమ కూతురికి ఆ బిడ్డను పంపించే ఏర్పాట్లు చేశారు. సమాచారం తెలియగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌కు ఆ బేబీని తీసుకెళ్లుతున్న వ్యక్తిని, బేబీని పోలీసులు అదుపపులోకి తీసుకున్నారు. మహిళను చంపేసిన దంపతులు, ఈ నేరంతో ప్రమేయం ఉన్న మహిళ తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఎగువ అసోం కెందుగురి బైలుంగ్ గ్రామంలో నివసించే మహిళ నీతుమొని లుఖురఖోన్‌కు ఓ పాప. పాపను వెంటపెట్టుకుని రావాలని నీతుమొనిని, ఓ పని ఉన్నదని చెప్పి నిందితులు రప్పించారు. తీరా వారిని కలిసిన తర్వాత నీతుమొని నుంచి ఆమె పాపను లాక్కునే ప్రయత్నం చేశారు. దీన్ని ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమెను పదునైన ఆయుధాలతో హతమార్చారు. ఆ వెంటనే బేబీని నిందిత దంపతులు తమ కొడుకుకు ఇచ్చి హిమాచల్ ప్రదేశ్‌లోని బిడ్డ వద్దకు పంపించారు.
నితుమొని మృతదేహం చరాయిదియో జిల్లాలోని రాజబరి టీ ఎస్టేట్‌లో ఓ డ్రైన్ నుంచి పోలీసులు మంగళవారం ఉదయం రికవరీ చేసుకున్నారు. సోమవారం సాయంత్రమే ఆమె సిమలుగురి మార్కెట్ నుంచి కనిపించకుండా పోయింది. కాగా, ఇంతలో నీతుమొని పాపను జొర్హత్‌లోని ఇంటర్ స్టేట్ బస్ టర్మినస్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. సిమలుగురి, శివసాగర్, చరాయిదియ్, జొర్హత్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేశారు.
Also Read: పెళ్లి చేసుకుని ఐదేళ్లు గడిచినా.. పిల్లలు పుట్టలేదని మనస్తాపం.. ఆత్మహత్య
పోలీసులు నీతుమొనిని హత్య చేసిన దంపతులు ప్రణాలి గొగోయ్ అలియాస్ హీరామాయి, ఆమె భర్త బసంత గొగోయ్‌లను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతి రోజే వీరి కుమారుడు ప్రసంత గొగోయ్‌ను, ఈ కేసులో ప్రమేయం ఉన్న బాధితురాలి తల్లి బోబీ లుఖురాఖోన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
నీతుమొనిని చంపేసి ఆమె పాపను హిమాచల్ ప్రదేశ్‌లోని తమ కూతురికి పంపించాలని ఆ దంపతులు ప్లాన్ వేశారని శివసాగర్ సీనియర్ పోలీసు అధికారి సుభ్రాజ్యోతి బరోహ్ తెలిపారు. ఈ దంపతులు అరెస్టు అయ్యే కాలానికి నీతుమొని పాపను, దంపతుల కొడుకు హిమాచల్ ప్రదేశ్‌కు ట్రైన్‌లో తీసుకెళ్లుతున్నాడని వివరించారు. అతడిని ట్రైన్‌లో అరెస్టు చేశామని, ఇది ప్రీప్లాన్‌డ్ మర్డర్ అని తెలిపారు. సంతానం లేని తమ కూతురి కుటుంబం కలలను నిజం చేయాలనే ఆలోచనలతో దంపతులు ఈ నేరానికి పాల్పడినట్టు వివరించారు.
ఈ నలుగురు నిందితులను స్థానిక కోర్టు పోలీసు కస్టడీకి పంపింది.