కరోనా లాక్ డౌన్ .. భారత్ లో 5.8లక్షల మంది ప్రాణాలకు ముప్పు

By telugu news teamFirst Published May 29, 2020, 2:02 PM IST
Highlights

కరోనా కారణంగా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సర్జరీలు వాయిదా పడుతున్నాయని నిపుణులు  చెబుతున్నారు. ఆస్పత్రులు మొత్తం కరోనా రోగుల కోసం మాత్రమే కేటాయిస్తున్నారు. దీంతో.. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి పరిస్థితి దారుణంగా ఉంది.
 

కరోనా కేసుల్లోనే కాదు... మరణాల్లోనూ చైనాను భారత్ దాటేసింది. చైనాలో కరోనా మృతులు ఇప్పటివరకు 4,634 కాగా, భారత్‌లో ఈ సంఖ్య 4,706 కు చేరుకుంది. దీంతో పరిస్థితి మరింత దిగజారినట్టుగా తెలుస్తోంది. మరోవైపు... కరోనా కేసుల విషయంలోనూ భారత్ తొమ్మిదవ స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉంటేనే కరోనా కేసుల ఉదృతి ఇలా ఉందంటే.. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి మరింత దారుణంగా మారతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సర్జరీలు వాయిదా పడుతున్నాయని నిపుణులు  చెబుతున్నారు. ఆస్పత్రులు మొత్తం కరోనా రోగుల కోసం మాత్రమే కేటాయిస్తున్నారు. దీంతో.. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి పరిస్థితి దారుణంగా ఉంది.

ఇలా అత్యవసరంగా చేయించుకోవాల్సిన సర్జరీలు వాయిదా పడటం కారణంగా ఎంతో మంది మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు 5.8 లక్షల ఎలక్టివ్‌ సర్జరీలను వాయిదా వేసినట్లు వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎలక్టివ్‌ సర్జరీలో ఎలక్టివ్‌ అనే ఆంగ్లపదం ‘ఎలిగెరి’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. 

ఎలిగెరి అంటే ఎంపిక చేసిన అని అర్థం. ఎలక్టివ్‌ సర్జరీలంటే అత్యవసరం కాకపోయినప్పటికీ సర్జరీ ద్వారా ప్రాణాలను కాపాడాల్సిన కేసులే. ఈ సర్జరీలను ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, రోగుల పరిస్థితిని దష్టిలో పెట్టుకొని ఎప్పుడు సర్జరీ చేయాలో ముందుగానే నిర్ధారిస్తారు. వాటి కోవలోకి హెర్నియా, అపెండిక్స్, కిడ్నీ, గాల్‌ బ్లాడర్‌ సర్జరీలను వాయిదా వేయవచ్చు. అయితే మరింత ఆలస్యమైతే రోగుల పరిస్థితి దుర్భరం అవుతుంది.

మే 18వ తేదీ నాటికి దేశంలో 5,05,800 అత్యవసరం కాని సర్జరీలు, 51,100 క్యాన్సర్‌ సర్జరీలు, 27,700 ఆబ్‌స్టెరిక్‌ సర్జరీలు (స్త్రీల అంగం, అండాశయం, గర్భాశ్రయంకు సంబంధించిన) పెండింగ్‌లో ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెల్సింది. ‘బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ సర్జరీ’ కూడా దాదాపు ఇంతే సంఖ్యను మే 12వ తేదీన వెల్లడించింది. 

భారత ప్రభుత్వం సూచనల ప్రకారం మొదటి వారంలో 48,725 సర్జరీలు వాయిదా పడ్డాయని, ఆ లెక్కన 12 వారాలకు(దాదాపు మూడు నెలల కాలానికి) 5,85,000 సర్జరీలు వాయిదా పడి ఉంటాయని ఆ పత్రిక పేర్కొంది. అలా ప్రపంచవ్యాప్తంగా 2.84 కోట్ల సర్జరీలు వాయిదా పడి ఉంటాయని అంచనా వేసింది. ఈ లెక్కన వీరి ప్రాణాలన్నీ ప్రమాదంలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

click me!