కోవిడ్ క‌ల‌క‌లం: కొత్త‌గా 11 మంది మృతి, మాక్ డ్రిల్స్ నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వం

By Mahesh RajamoniFirst Published Apr 10, 2023, 10:23 AM IST
Highlights

New Delhi: దేశంలోని మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో హ‌ర్యానా, కేర‌ళ‌, పుదుచ్చేరిలు ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేశాయి. అలాగే, కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల‌ను కోవిడ్ నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌లంటూ హెచ్చ‌రించింది. 
 

Coronavirus update india: భార‌త్ లో మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెరుగుద‌ల ఆందోళ‌న క‌లిగిస్తోంది. అంతకుముందు రోజుతో పోలిస్తే భారతదేశంలో సోమవారం రోజువారీ కోవిడ్ -19 కేసులలో స్వల్ప పెరుగుదలన‌మోదైంది. కొత్త‌గా 5,880 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, ఆదివారం ఒక్కరోజే 5,357 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు 35,199కి చేరుకున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఇప్పటివరకు మొత్తం 44,196,318 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం క‌రోనావైర‌స్ రికవరీ రేటు 98.74 శాతానికి పెరిగింది. మ‌ర‌ణాలు సైతం పెరుగుతున్నాయ‌ని వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 14 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 53,09,79కి చేరింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కాగా, గ‌త ప‌ది రోజులు నుంచి దేశంలో క‌రోనా వైర‌స్ కొత్త కేసుల న‌మోదు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న ప‌స్థితులు ఉన్నాయి. శనివారం 6,155 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అంత‌కుముందు రోజు శుక్రవారం 6,050 ఇన్ఫెక్షన్ల నుండి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించారు. 

దేశ‌వ్యాప్తంగా మాక్ డ్రిల్స్.. 

భారతదేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున, ఆస్పత్రుల సన్నద్ధతను అంచనా వేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమ, మంగళవారాల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వ‌హించ‌నుంద‌ని ప్రకటించింది. ప్రభుత్వ, ప్ర‌యివేటు సంస్థలు ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. జీనోమ్ పరీక్షలను పెంచాలని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్రాలను ఆదేశించారు.

మాస్కులు త‌ప్ప‌నిస‌రి.. 

దేశంలోని మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో హ‌ర్యానా, కేర‌ళ‌, పుదుచ్చేరిలు ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేశాయి. అలాగే, కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల‌ను కోవిడ్ నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌లంటూ హెచ్చ‌రించింది. నోయిడా, ఘ‌జియాబాద్ జిల్లా యంత్రాంగాలు విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌తిఒక్క‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తోంది. 

ఢిల్లీలో పెరుగుతున్న కేసులు.. 

ఆదివారం, ఢిల్లీలో రోజువారీ కోవిడ్ సంఖ్య 699 కు పెరిగిందని ప్రభుత్వ డేటాను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది, దీని ప్రకారం దేశ రాజధానిలో మొత్తం కేసుల సంఖ్య 2,014,637 గా ఉంది. గడిచిన 24 గంటల్లో నగరంలో నాలుగు మరణాలు సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 26,540కి పెరిగింది. అయితే, కోవిడ్ కేసులు పెరిగానా దానిని నిర్వ‌హించేందుకు త‌గిన ఏర్పాట్లు చేసిన‌ట్టు ఆప్ స‌ర్కారు పేర్కొంది.

click me!