చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి: దేశ ప్రజలను కోరిన ప్రధాని మోదీ

By Sumanth KanukulaFirst Published Dec 25, 2022, 3:28 PM IST
Highlights

కోవిడ్-19 వైరస్ చాలా దేశాల్లో విస్తరిస్తున్నందున దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు.

కోవిడ్-19 వైరస్ చాలా దేశాల్లో విస్తరిస్తున్నందున దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఈ సంవత్సరం తన చివరి ‘‘మన్ కీ బాత్’’ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజలు కరోనా ప్రోటోకాల్‌ను పాటించాలని చెప్పారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది ప్రజలు విహారయాత్రలో ఉన్నవారు, విహారయాత్రకు వెళ్లాలని అనుకునేవారు.. కరోనా వైరస్ వారి ఆనందాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా చూసుకోవడానికి మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి ప్రోటోకాల్‌లను అనుసరించాలని ప్రధాని మోదీ కోరారు.

మరికొద్ది రోజుల్లో ముగియనున్న 2022 సంవత్సరం.. భారతదేశానికి అనేక విధాలుగా స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని అన్నారు. 220 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోస్‌లతో భారతదేశం ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుందని ప్రధాని మోదీ చెప్పారు. అలాగే దేశం ఐదవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆయన అన్నారు.

ఇక, చైనాలో జీరో-కోవిడ్ విధానాన్ని ఎత్తివేయడం వల్ల కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మరికొన్ని దేశాల్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కరోనాకు వ్యతిరేకంగా చర్యలను వేగవంతం చేసింది. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, ప్రజలు మాస్క్‌లు ధరించాలని, అలాగే కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. జీనోమ్ సీక్వెన్సింగ్ , కోవిడ్ పరీక్షలను పెంచడం గురించి కూడా మోదీ మాట్లాడారు. నిర్లక్ష్యానికి పాల్పడిన ప్రజలను హెచ్చరిస్తూ, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కోవిడ్ ఇంకా ముగియలేదని ప్రధాని చెప్పారు.

ఇదిలా ఉంటే.. భారత్‌లో కూడా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 227 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,424కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 27 కేసుల పెరుగుదల నమోదైంది. ఇక, తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం  కరోనా కేసుల సంఖ్య 4,46,77,106గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. 

గత 24 గంటల్లో దేశంలో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. అందులో ఒకటి మహారాష్ట్రలో, మరోకటి కేరళలో నమోదయ్యాయి. ఈ మరణాలతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,30,693కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల మొత్తం.. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.01 శాతంగా ఉంది. కోవిడ్ రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఇక, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,42,989కి చేరుకుంది. ఇక, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.05 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.

click me!