రామ సేతుపై బీజేపీ ప్రజలను తప్పుదారి పట్టించింది.. క్షమాపణలు చెప్పాలి: ఛత్తీస్‌గడ్ సీఎం

By Mahesh KFirst Published Dec 25, 2022, 3:00 PM IST
Highlights

రామ సేతుపై దేశ ప్రజలను బీజేపీ తప్పుదారి పట్టించిందని ఛత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రామ సేతుపై ఇదే సమాధానాన్ని ఇచ్చిందని, అప్పుడు తమను వారు రామ వ్యతిరేకులని ప్రచారం చేసిందని తెలిపారు.
 

రాయ్‌పూర్: రామ సేతుపై బీజేపీ దేశాన్ని తప్పుదారి పట్టించిందని, దేశ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఛత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్ డిమాండ్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయాలనే గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తెలిపిందని గుర్తు చేశారు. కానీ, అప్పటి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాలను బీజేపీ తప్పుపట్టిందని, ఆ వ్యాఖ్యలు రాముడికి వ్యతిరేకమైనవని ముద్ర వేశాయని వివరించారు. రాయ్‌పూర్‌లో ఓ హెలిప్యాడ్ వద్ద శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంటులో ఇచ్చిన సమాధానంపై విలేకరులు సీఎం భుపేశ్ భగేల్‌ను ప్రశ్నించారు. దీనిపై ఆయన ఈ విధంగా మాట్లాడారు.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఇదే విషయాన్ని చెప్పింది. కానీ, అప్పుడు మమ్మల్ని రామ వ్యతిరేకులుగా ముద్ర వేశారు. రామ భక్తులమని చెప్పుకునే ప్రభుత్వ నేతలు రామ సేత పై పటిష్ట ఆధారాలు లేవని పార్లమెంటులో చెబుతున్నారు. ఇప్పుడు మరి వారిని ఏ కేటగిరీలో వేద్దాం? ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు వారంతా క్షమాపణలు చెప్పాలి’ అని సీఎం అన్నారు.

రామ సేతు విషయంపై ప్రభుత్వ వైఖరిని ఆర్ఎస్ఎస్ కూడా ప్రశ్నించలేదని అన్నారు. వారు నిజంగా రామ భక్తులే అయ్యుంటే వారు ప్రభుత్వాన్ని విమర్శించి ఉండేవారు అని పేర్కొన్నారు.

Also Read: #RamSetu:అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ రివ్యూ!

రామ సేతు ఉనికి, నీట మునిగిన ద్వారక నగరాల వాదనలు నిజమే అని శాటిలైట్ చిత్రాల ద్వారా నిరూపించవచ్చునా? అని ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటులో సమాధానం ఇచ్చారు. భారత్, శ్రీలంకను కలుపుతున్న రామ సేతు రీజియన్ పై శాటిలైట్లు హై క్వాలిటీ రిజల్యూషన్ చిత్రాలను అందించిందని ఆయన రాజ్యసభకు తెలిపారు. అయితే, ఆ చిత్రాలు ఈ నిర్మాణాల మూలాలు, వయసును నేరుగా నిరూపించే సమాచారాన్ని ఇవ్వలేవని వివరించారు.

‘స్పేస్ టెక్నాలజీ ద్వారా కొన్ని దీవులు, సముద్ర ఉపరితలానికి కొంత లోతులోనే ఉన్న సున్నపురాళ్లను చూడగలం. కానీ, అవి ఓ వారధికి సంబంధించిన శకలాలు అని కచ్చితంగా చెప్పలేం. అయితే, అవి వరుసగా కనిపిస్తున్నాయి. దీని ద్వారా మనం కొన్ని విషయాలను ఊహించుకోవచ్చు. క్లుప్తంగా నేను చెప్పడానికి ప్రయత్నించేదేమంటే.. అక్కడ పూర్వం కచ్చితంగా ఒక నిర్మాణం ఉన్నదని చెప్పడం కష్టమే. కానీ, ఆ నిర్మాణాలు అక్కడ ఉండేవని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్ని సూచనలు లేకపోలేవు’ అని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

click me!