
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళకు కోర్టులో చుక్కెదురైంది. చెన్నైలోని సిటీ సివిల్ కోర్టులో ఆమెకు ఊహించని రీతిలో తీర్పు వెలువడింది. ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రెటరీగా కొనసాగే హక్కు కోసం వేసిన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. అయితే పార్టీ పగ్గాలు అందిపుచ్చుకోవడానికి ఆమె మరిన్ని న్యాయ పోరాటాలు చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. పైకోర్టులో ఈ ఆదేశాలను సవాల్ చేసే అవకాశాలు ఉన్నది.
జయలలిత మరణించిన తర్వత ఏఐఏడీఎంకే సెక్రెటరీని ఎన్నుకునే నిర్ణయాన్ని ఎడప్పాడి పళనిస్వామి, ఇతర నేతలు శశికళ చేతిలో పెట్టారు. అందుకు సంబంధించిన ఫైల్స్‌ను కూడా ఆమెకే అప్పగించారు. ఆ తర్వాత ఆమె స్వయంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులు జైలు పాలయ్యారు. బెంగళూరు జైలులో ఆమె నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి మళ్లీ తమిళనాడులోకి ఎంటర్ అయ్యారు.
శశికళ జైలుకు వెళ్లగానే అప్పుడు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా ఎడప్పాడి పళనిస్వామి నియమించారు. ఆ తర్వాత 2017లో ఏఐఏడీఎంకే జనరల్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జనరల్ సెక్రెటరీ పదవి నుంచి శశికళను, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పదవి నుంచి టీటీవీ దినకరణ్‌ను తొలగిస్తూ తీర్మానం వచ్చింది. దీంతో జైలు శిక్ష పూర్తి చేసుకుని రాష్ట్రంలోకి వచ్చిన శిశకళ ఈ పార్టీ తీర్మానాన్ని సవాల్ చేస్తూ చెన్నైలోని మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ తీర్మానాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. కాగా, ఏఐఏడీఎంకే కో ఆర్డినేటర్ ఓ పనీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామిలు శశికళ పిటిషన్‌ను కొట్టేయాలని పిటిషన్ వేశారు.
ఆమె జైలు నుంచి విడుదలై వచ్చినప్పటి నుంచి ఆమె తనకు తాను ఒక ఏఐఏడీఎంకే నేతగా చిత్రీకరించుకుంటున్నారని వారు పేర్కొన్నారు. అసలు ఆమెకు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేకున్నా.. ప్రజల ముందు పార్టీలో ఆమె అంతర్భాగంగా ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ పార్టీ ప్రస్తుత నాయకత్వం ఎడప్పాడి పళనిస్వామి, ఓ పనీర్‌సెల్వంలకు చెందినదని ఎన్నికల సంఘం కూడా పునరుద్ఘాటించినట్టు వారు పేర్కొన్నారు. కాబట్టి, శశికళ పిటిషన్‌ను వెంటనే కొట్టేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు శశికళ పిటిషణ్‌ను కొట్టేసింది.