
Communal Clashes: దేశంలో ద్వేషం, హింస పెరిగిపోతోందని, న్యాయమైన, సమ్మిళిత భారతదేశం కోసం పౌరులు ఏకం కావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సోమవారం అన్నారు. ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో రామనవమి ఊరేగింపుల సందర్భంగా అనేక నగరాల్లో మత ఘర్షణలు మరియు హింస తర్వాత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయా హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నాయకుడు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పందిస్తూ.. అసంతృప్తి వ్యక్తం చేశారు. "ద్వేషం, హింస మరియు బహిష్కరణ మన ప్రియమైన దేశాన్ని బలహీనపరుస్తున్నాయి. సోదరభావం, శాంతి మరియు సామరస్య ఇటుకలతో పురోగతికి మార్గం సుగమం చేయబడింది. న్యాయమైన, సమ్మిళిత భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కలిసి నిలబడదాం" అని రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కాగా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (Jawaharlal Nehru University-JNU)లోని కావేరీ హాస్టల్‌లో శ్రీ రామనవమి రోజున హాస్టల్ మెస్‌లో మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణలపై ఆదివారం రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. హింసాకాండలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని రిపోర్టులు పేర్కొన్నాయి. యూనివర్సిటీలో జరిగిన హింసాకాండపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన గుర్తు తెలియని విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు సోమవారం కేసు నమోదుచేశారు. “పలువురు ABVP విద్యార్థులపై ఈ ఉదయం JNUSU, SFI, DSF & AISA సభ్యులైన విద్యార్థుల బృందం నుండి మాకు ఫిర్యాదు అందింది. దీని ప్రకారం.. మేము సెక్షన్ -323, 341, 509, 506, 34 IPC కింద FIR నమోదు చేసాము. సాక్ష్యాలను సేకరించి నిందితులను గుర్తించేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది” అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) లో చోటుచేసుకున్నహింసాత్మక ఘటనపై వర్సీటి అధికారులు స్పందించారు. ఈ హింసపై అడ్మినిస్ట్రేషన్ సోమవారం నాడు విద్యార్థులను హెచ్చరించింది. వర్సిటీలో ఎలాంటి హింసను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. క్యాంపస్‌లో శాంతియుత వాతావరణాన్ని చెదరగొట్టే చర్యలకు దిగవద్దని విద్యార్థులకు సూచించింది. క్యాంపస్‌లో హింసను ఉపేక్షించేది లేదని జేఎన్‌యూ వీసీ స్పష్టం చేసినట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. వర్సిటీలో హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
అంతకుముందు ఆదివారం కూగా శ్రీరామ నవమి సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో శ్రీ రామనవమి ఊరేగింపుల సందర్భంగా మత ఘర్షణలు జరిగాయి. గుజరాత్, జార్ఖండ్‌లలో ఒక్కొక్కరు మరణించారని, నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. ఆయా ఘటనలపై కేసులు నమోదుచేసుకునీ, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.