జేఎన్‌యూలో హింసను ఉపేక్షించం: నాన్ వెజ్ ఫుడ్‌పై దాడులను ఖండిస్తూ యాజమాన్యం వార్నింగ్

Published : Apr 11, 2022, 03:06 PM IST
జేఎన్‌యూలో హింసను ఉపేక్షించం: నాన్ వెజ్ ఫుడ్‌పై దాడులను ఖండిస్తూ యాజమాన్యం వార్నింగ్

సారాంశం

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మరోసారి కల్లోలం రేగింది. ఈ సారి శ్రీరామ నవమి రోజునే మెస్‌లో నాన్ వెజ్ ఫుడ్ కేంద్రంగా దాడులు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆహారం తిన్నందుకు ఏబీవీపీ సభ్యులు తమపై దాడి చేశారని వామపక్ష భావజాలం వైపు నిలబడే విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. కాగా, రామ పూజ చేస్తుండగా వారు ఆటంకాలు సృష్టించినందునే గొడవలు జరిగాయని ఏబీవీపీ ఆరోపించింది. ఈ ఘర్షణల నేపథ్యంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎలాంటి హింసను ఉపేక్షించబోమని వీసీ వార్నింగ్ ఇచ్చింది.  

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హింసపై అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు వార్నింగ్ ఇచ్చింది. వర్సిటీలో ఎలాంటి హింసను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. క్యాంపస్‌లో శాంతియుత వాతావరణాన్ని చెదరగొట్టే చర్యలకు దిగవద్దని స్టూడెంట్లకు సూచించింది. క్యాంపస్‌లో హింసను ఉపేక్షించేది లేదని జేఎన్‌యూ వీసీ స్పష్టం చేసినట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లోని హాస్టల్ మెస్‌లో ఆదివారం మాంసాహారాన్ని వడ్డించడాన్ని కొందరు అడ్డుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. శ్రీరామ నవమి సందర్భంగా మెస్‌లో నాన్ వెజ్ తినరాదని వారు హుకూం జారీ చేసినట్టు వాదనలు వచ్చాయి. నాన్ వెజ్ తినరాదని అడ్డుకోవడంతో కొందరి మధ్య గలాట మొదలైంది. ఆ గొడవ తర్వాత తీవ్ర రూపం దాల్చింది. ఈ దాడి ముఖ్యంగా జేఎన్‌యూఎస్‌యూ, ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీల సభ్యుల మధ్య జరిగినట్టు తెలిసింది. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డట్టు సమాచారం.

జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి అఖ్తారిస్తా అన్సారీ కావేరీ మెస్‌లో ఆహారం భుజిస్తుండగా దాడికి గురయ్యారు. కావేరీ హాస్టల్ మెస్‌లో తాను ఆహారం తింటూ ఉండగా ఏబీవీపీ సభ్యులు కర్రలతో తనపై దాడి చేసినట్టు అఖ్తారిస్తా అన్సారీ తెలిపారు. తాము ఏబీవీపీ వాదిస్తున్నట్టు రామ నవమి పూజను అడ్డుకోలేదని, కానీ, వారు మాత్రం నాన్ వెజ్ ఫుడ్ కేంద్రంగా దాడులు చేశారని ఆరోపించారు. ఈ దాడుల్లో కనీసం 16 మంది విద్యార్థులు గాయపడినట్టు తెలిసింది.

ఈ ఘటన అనంతరం ఏబీవీపీ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. తమకు నాన్ వెజ్ ఫుడ్ అందించడంపై అభ్యంతరం ఏమీ లేదని స్పష్టం చేశారు. తమ హాస్టల్‌లో ఒకవైపు పూజా చేసుకుంటూనే మరో వైపు ఇఫ్తార్ కూడా చేపట్టామని వివరించారు. తాము ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా హాస్టల్‌లో పూజ చేస్తుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అందుకే ఈ ఘర్షణలు జరిగాయని అన్నారు. కాగా, ప్రత్యర్థి వర్గం మాత్రం నవమి పూజతో గొడవలు జరగలేవని, మెస్‌లో నాన్ వెజ్ ఫుడ్ తిన్నందుకే వారు గొడవలు మొదలు పెట్టారని ఆరోపించారు.

ఈ ఘటనల అనంతరం ఈ రోజు ఉదయం జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్, ఏఐఎస్ఏలు గుర్తు తెలియని ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ఏబీవీపీ కూడా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు అందిస్తామని తెలిపింది. అలాగే, వర్సిటీ ప్రోక్టార్‌కూ ఫిర్యాదు చేస్తామని వివరించింది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?