
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డికి 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్ట్. కాగా.. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఈడీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులను విజయ్ నాయర్ సేకరించి ఆప్ నేతలకు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్‌లో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కూడా నిర్వహించాయి. అయితే ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు.
ALso Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. వైసీపీ ఎంపీ మాగుంట కొడుకు రాఘవ రెడ్డి అరెస్ట్..
ఇక, సౌత్ గ్రూప్ నుంచి ఇప్పటికే కొందరిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయగా.. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును మంగళవారం సీబీఐ అరెస్ట్ చేసింది. బుచ్చిబాబు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వద్ద గతంలో చార్టర్డ్ అకౌంటెంట్ పనిచేశారు.
అసలు కేసు ఏమిటంటే..
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐని కోరారు. దీంతో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నుంచి మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇక, ఇప్పటి వరకు ఈడీ ఈ కేసులో రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. తాజాగా మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో అరెస్ట్ చేసినవారి సంఖ్య తొమ్మిది మందికి చేరింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 గత ఏడాది ఆగస్టులో రద్దు చేయబడింది.