
ఒక జంట ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించారు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బరౌత్‌లో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల (financial crisis) కారణంగా వారు బలవన్మరణానికి యత్నించినట్టుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వివరాలు.. రాజీవ్ తోమర్ చెప్పుల వ్యాపారిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య పూనమ్ తోమర్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే రాజీవ్ తన భార్య పూనమ్‌తో కలిసి మంగళవారం ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని ఫేస్‌బుక్ లైవ్‌లో ఉంచాడు.
ఈ సందర్భంగా అతడు తన బాధను వ్యక్తం చేశాడు. తాను దేశ వ్యతిరేకిని కాదని వెల్లడించాడు. ప్రధాని మోదీ రైతుల, చిన్న వ్యాపారుల శ్రేయోభిలాషి కాదని అన్నాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో దంపతులు ఆత్మహత్యకు యత్నించడం చూసిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. మరికొందరు వెంటనే వారి ఇంటికి తరలించారు. అక్కడికి చేరుకున్నవారు వెంటనే రాజీవ్, పూనమ్‌లను ఆస్పత్రికి తరలించారు. రాజీవ్ చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పోలీసులు తెలిపారు.
‘నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని నేను భావిస్తున్నాను. నా దగ్గర ఉన్న అప్పులు తీరుస్తాను. నేను చచ్చినా వాటిని చెల్లిస్తాను. అయితే దయచేసి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ షేర్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. నేను దేశ వ్యతిరేకిని కాను.. కానీ ప్రధాని మోదీకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు చిన్న వ్యాపారులు, రైతుల శ్రేయోభిలాషి కాదు. మీ విధానాలను మార్చుకోండి’ అని రాజీవ్ తోమర్ తెలిపారు.
దంపతుల ఆర్థిక నష్టాల గురించి తమకు తెలుసునని వారి కుటుంబ సభ్యుల తెలిపారు. అయితే వారిద్దరు ఆత్మహత్యకు యత్నిస్తారని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు.
(Disclamir: ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు. సంక్షోభం వంటి పరిస్థితులు ఎదురైతే, అలాంటి భావన కలిగితే.. మీరు కౌన్సెలింగ్ మద్దతు కోసం 9152987821, 9820466726, 7893078930 (హైదరబాద్ వన్‌లైఫ్) కు కాల్ చేయవచ్చు. ఈ నెంబర్‌లు పూర్తిగా పబ్లిక్ డొమైన్ నుంచి సేకరించబడినవి.. వీటిని Asianet Telugu ధ్రువీకరించలేదు)