
విద్యార్థులు హిజాబ్ (Hijab) ధరించడంపై వివాదం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులను దాటి బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ (madhya pradesh), పుదుచ్చేరి (puducherry)లో మంగళవారం బయటపడింది. పుదుచ్చేరిలోని అరియాంకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్ తరగతిలో విద్యార్థి హిజాబ్ వేసుకొని రావడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అలాగే మధ్య ప్రదేశ్ లో విద్యాశాఖ మంత్రి హిజాబ్ పై వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి ప్రతిపక్షం ఆయనపై విమర్శలు గుప్పించింది.
కర్నాకటలో విద్యార్థులు హిజాబ్ ధరించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) ఆదేశించారు. గత నెలలో ఉడిపిలోని ఓ కళాశాలలో ఈ వివాదం మొదలైంది. ముస్లిం బాలికలు తరగతిలో హిజాబ్ ధరించడంపై రైట్‌వింగ్ గ్రూపులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆందోళనలు చేయడం ప్రారంభించాయి.
హిజాబ్‌పై నిషేధానికి మద్దతు ఇస్తూ మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ (indar singh parmar) వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ‘‘ హిజాబ్ స్కూల్ యూనిఫామ్‌లో భాగం కాదు. అందుకే పాఠశాలల్లో దానిని ధరించడం నిషేధించాలి. సంప్రదాయాలను ప్రజలు వారి ఇళ్లలో పాటించాలి కానీ పాఠశాలల్లో కాదు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ (dress code)ను కఠినంగా అమలు చేయడానికి మేము కృషి చేస్తున్నాము ’’ అని ఆయన మీడియాతో చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో హిజాబ్‌ను నిషేధిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. సమస్యను పరిశీలించిన తర్వాత అవసరమైతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి సమాధానం ఇచ్చారు.
మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ (abbas hajeeb) స్పందించారు. ‘‘ మంత్రి తన ప్రాధాన్యత ఏమిటో మాకు తెలపాలని కోరుకుంటున్నాం. కోవిడ్ సమయంలో పాఠశాలల పనితీరుపై దృష్టి పెట్టడమా ? లేక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా విద్యా నాణ్యతను మెరుగుపరచడమా లేక మతపరమైన విభజన ఎజెండాను అనుసరించమా ? ’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ మన దేశ రాజ్యాంగం ప్రతీ పౌరుడికి తన మతాన్ని ఆచరించే హక్కును కల్పించింది. అయితే బీజేపీ ప్రభుత్వం పాఠశాలకు వెళ్లే పిల్లలను కూడా వారి మతపరమైన ఆచారాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తోంది. సిక్కులు తలపాగా ధరించడం, ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం చాలా కాలం నుంచే కొనసాగుతోంది. దశాబ్దాలుగా ఈ ప్రభుత్వం (బీజేపీ) ఈ పురాతన సంప్రదాయాలకు స్వస్తి పలకాలని కోరుకుంటోంది, ఇది ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి మానసిక దివాళాకోరుతనాన్ని తెలియజేస్తుంది ’’ అని ఘాటుగా విమర్శించారు.
మధ్యప్రదేశ్‌లో దాదాపు 1.25 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పాఠశాల యూనిఫాం
సదుపాయం ఉంది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు యూనిఫాం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది.
మరోవైపు.. పుదుచ్చేరిలో ఒక విద్యార్థి హిజాబ్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉపాధ్యాయుడిపై విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థల నుండి తమకు ఫిర్యాదులు అందాయని విద్యా డైరెక్టరేట్ ప్రతినిధి తెలిపారు. ‘‘ వాస్తవానికి ఏమి జరిగిందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. పాఠశాల నుండి నివేదికను స్వీకరించిన తర్వాత చర్య తీసుకుంటాం.’’ అని ఆయన తెలిపారు. ఈ విషయంపై లెఫ్ట్-బ్యాక్డ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( Left-backed Students Federation of India) నాయకుడు మాట్లాడుతూ.. ఆ బాలిక గత మూడేళ్లుగా హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతుందని తెలిపారు. ఆ సమయంలో లేని అభ్యంతరం ఎప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వీరంపట్టణం, ఎంబాలం, తిరుకనూరులోని కొన్నిపాఠశాలలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rss) కార్యక్రమాల్లో నిర్వహించే విధంగా ‘డ్రిల్’లను ప్రోత్సహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. తాము దీనిపై కూడా విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం. అధికారుల చొరవతో సంస్థల కాషాయీకరణను నిరోధించాలని తాము కోరుతున్నాం అని చెప్పారు.