
దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నగరంలోని వసంత్‌కుంజ్ కిషన్‌గఢ్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. ఉదయం ఇంట్లో తలుపు తెరిచి వుండటంతో వారింట్లో పనిచేసేవారు లోనికి వెళ్లి చూడగా ఆ ఇంట్లోని దంపతులతో పాటు వారి కుమార్తె రక్తపు మడుగులో చనిపోయి వున్నారు.
ఈ మృతదేహాలకు పక్కనే మరో కుమారుడు కూడా తీవ్రగాయాలతో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. ప్రాణాపాయంతో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలించారు.
వీరిని ఎందుకు హత్య చేశారు..? ఎవరు హత్య చేశారు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏం జరిగింది తెలియాలంటే ఆస్పత్రిలో కొనఊపిరితో ఉన్న వ్యక్తి కోలుకోవాల్సిందే. ఈ సంఘటనతో ఢిల్లీ ఉలిక్కిపడింది.