తమ కూతుళ్లను ఇద్దరిని స్వామి నిత్యానంద ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధించారని శర్మ దంపతులు గుజరాత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కూతుళ్లను ఇద్దరిని తమకు అప్పగించేలా చూడాలని కోరారు.
అహ్మదాబాద్: వివాదాస్పద స్వామి నిత్యానంద మరో వివాదంలో చిక్కుకున్నారు. నిత్యానంద నడుపుతున్న ఆశ్రమంలో తమ కూతుళ్లను ఇద్దరిని బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తూ వారిని తమకు అప్పగించేలా చూడాలని దంపతులు గుజరాత్ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
స్వామి నిత్యానంద బెంగళూరులో నడిపే విద్యాసంస్థలో 2013లో తమ నలుగురు కూతుళ్లను చేర్పించామని, వారి వయస్సు 7 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పిటిషనర్ జనార్దన శర్మ, ఆయన భార్య సోమవారం కోర్టుకు తెలిపారు.
తమ కూతుళ్లను ఈ ఏడాది నిత్యానంద నడిపే యోగిని సర్వజ్ఞపీఠం అనే మరో నిత్యానంద ధ్యానపీఠానికి మార్చారని, అది అహ్మదాబాదులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఉంటుందని, వారిని కలవడానికి తాము ప్రయత్నించామని వారు వివరిం్చారు.
తమ కూతుళ్లతో భేటీ కాకుండా సంస్థ అధికారులను తమను అడ్డుకున్నారని వారు చెప్పారు. పోలీసుల సహకారంతో శర్మ దంపతులు సంస్థలోకి వెళ్లి తమ ఇద్దరు మైనర్ కూతుళ్లను తీసుకుని రాగలిగారు. అయితే, మరో ఇద్దరు కూతుళ్లు లోపముద్ర జనార్దన శర్మ (21), నందిత (18) తమతో రావడానికి నిరాకరించారని పిటిషన్ లో వారు చెప్పారు.
తమ ఇద్దరు చిన్న కూతుళ్లను కిడ్నాప్ చేసి, రెండు వారాలకు పైగా అక్రమంగా నిర్బంధించి, నిద్ర పోకుండా చేశారని వారు చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారులపై తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వారు చెప్పారు.
అక్రమంగా నిర్బంధించిన తమ ఇద్దరు కూతుళ్లను కోర్టు సమక్షంలో తమకు అప్పగించేలా చూడాలని శర్మ దంపతులు కోర్టును కోరారు. నిత్యానందపై కర్ణాటక కోర్టు నిరుడు జూన్ లో అత్యాచారం కేసులో అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.