
దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాల ఉత్కంఠ నెలకొంది. నేడు తెలంగాణలోని మునుగోడు తోసహా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు సాయంత్రంలోగా వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం.. ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు 2022 నవంబర్ 3న ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గం, బీహార్‌లో గోపాల్ గంజ్, మోకమ నియోజక వర్గం. మహారాష్ట్రలోని తూర్పు అంధేరి, ఉత్తరప్రదేశ్ లోని గోల గోకరన్నాథ్, హర్యానా లోని అదంపూర్, ఒడిశాలోని ధామ్‌నగర్ నియోజక వర్గానికి ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాలకు వివిధ కారణాల వల్ల ఖాళీ కావడంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.
ఉప ఎన్నికలు ఎక్కడ జరిగాయి?
తెలంగాణ-మునుగోడు
బీహార్-మోకమ
బీహార్- గోపాల్‌గంజ్
మహారాష్ట్ర-తూర్పు అంధేరి
హరియాణ-అదంపూర్
ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్
ఒడిశా- ధామ్‌నగర్
తెలంగాణ
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమయ్యాయి. ఆయన అనంతరం బీజేపీలో చేరారు. పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఉపఎన్నికలో బరిలో నిలిచారు. ఇక అధికార పార్టీ తెరాస తరుపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రెడ్డిని పోటీలో దింపింది. మొత్తంగా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలిచారు.
మహారాష్ట్రలోని తూర్పు అంధేరి నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఇటు షిండే ప్రభుత్వానికి.. అటు ఉద్ధవ్ ఠాక్రేలకు కీలకంగా మారింది. ఏక్ నాథ్ షిండే అధికారం చేపట్టిన తరువాత జరిగిన తొలి ఎన్నిక కావడంతో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే..మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ స్థానంలో (అంధేరి తూర్పు)రమేశ్ లాట్కే భార్య రుతుజా ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో శివసేన గెలుపు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇక హర్యానా హర్యానాలో మాజీ సీఎం భజన్‌లాల్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో కూడా ఎన్నికల ఫలితాలు నేడు వెలువడునున్నాయి. ఈ స్థానంలో మరో సారి విజయ బావుటను ఎగరవేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు(కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు) భవ్య బిష్ణోయ్ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. కుల్దీప్ గత ఆగస్టులో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను రంగంలో దించగారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను తమ అభ్యర్థిగా నిలిపింది.
ఇక బీహర్ లోని మోకమ, గోపాల్‌గంజ్ జరిగిన ఉప ఎన్నికలు కూడా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఆ రాష్ట్రంలో 'మహాఘట్‌బంధన్' ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి ఎన్నికలు. గత మూడు నెలల క్రితం బీజేపీతో విభేదించి..ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన
విషయం తెలిసిందే.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలు ప్రకటించబడ్డాయి. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో జరగనున్న ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.