సంచలనం: ఆసుపత్రిలో ఉండాల్సిన కరోనా రోగి.. బస్టాండ్‌లో విగత జీవిగా

By Siva Kodati  |  First Published May 17, 2020, 7:46 PM IST

కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనుషుల మధ్య సామాజిక సంబంధాలు క్షీణించిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం చైనాలోని ఓ నగరంలో ఫుట్‌పాత్‌పై పడివున్న మృతదేహాన్ని కరోనా భయంతో స్థానికులు ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు


కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనుషుల మధ్య సామాజిక సంబంధాలు క్షీణించిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం చైనాలోని ఓ నగరంలో ఫుట్‌పాత్‌పై పడివున్న మృతదేహాన్ని కరోనా భయంతో స్థానికులు ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు.

ఇక మనదేశం సంగతి సరే సరి. కోవిడ్ 19 కారణంగా చనిపోయిన వారి ఇంటి ఛాయలకు కూడా వెళ్లడానికి కూడా జనం భయపడిపోతున్నారు. అలాగే వేరే వూళ్లకు వెళ్లొచ్చిన వారిని గ్రామాల్లోకి అనుమతించడం లేదు.

Latest Videos

తాజాగా గుజరాత్‌తో ఓ హృదయ విదారక ఘటన జరిగింది. కోవిడ్ 19 సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఛగన్ మక్వానా అనే వ్యక్తి బస్టాండ్‌లో విగతజీవిగా పడివున్న ఘటన కలకలం రేపింది.

మే 10 నుంచి కరోనా వ్యాధితో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నగరంలోని బీఆర్‌టీఎస్ బస్టాండ్ వద్ద పోలీసులు కనుగొన్నారు. బాధితుడి జేబులో లభించిన లేఖ, మొబైల్ ఫోన్ ద్వారా ఆయనను ఛగన్‌ మక్వానాగా గుర్తించారు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆయన శాంపిల్స్‌ను పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారని భావించిన మక్వానా కుటుంబసభ్యులకు ఆయన మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది.

ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకోగానే సమాచారం అందిస్తామని ఆసుపత్రి వైద్యులు తమకు తెలిపారని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. వారంతా కూడా రెండు వారాలుగా హోం క్వారంటైన్‌లో ఉన్నామని చెప్పుకొచ్చారు.

అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన మక్వానాను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి నుంచి ఎందుకు బయటకు పంపారో తెలపాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ విచారణకు ఆదేశించారు. 

click me!