24 గంటల్లో 796 కొత్త కేసులు, 35 మరణాలు: భారత్‌లో 2 లక్షల మందికి కరోనా టెస్టులు పూర్తి

By Siva KodatiFirst Published Apr 13, 2020, 5:54 PM IST
Highlights

భారతదేశంలో కరోనా రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 796 కరోనా పాజిటివ్  కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య వాఖ వెల్లడించింది. 

భారతదేశంలో కరోనా రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 796 కరోనా పాజిటివ్  కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య వాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 35 మంది వైరస్ కారణంగా మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 9,152కి, మృతుల సంఖ్య 308కి చేరిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 857 మంది కోవిడ్ 19 నుంచి కోలుకున్నట్లు లవ్ అగర్వాల్ చెప్పారు.

దేశంలో ఇప్పటి వరకు 2 లక్షలమందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించామని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధికారి రమణ్ ఆర్ గంగా ఖేద్కర్ తెలిపారు. టెస్టింగ్ కిట్లు సరిపడా ఉన్నాయని.. మరో ఆరు వారాలకు సరిపడా కిట్లు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని రమణ్ చెప్పారు.

చైనా నుంచి రావాల్సిన కిట్లు బుధవారం నాటికి భారతదేశానికి చేరుకుంటాయని ఆయన అన్నారు. గతంలో కరోనా కేసులు నమోదైన 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇదే సమయంలో దేశవ్యాప్తంగా నిత్యావసరాలు, ఇతర సరకుల కొరత లేకుండా రాష్ట్రాల మధ్య లారీల రవాణాకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. నిత్యావసరాలకు సంబంధించిన రంగాల్లో పనిచేసే కూలీలు, కార్మికులను అడ్డుకోవద్దని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 

click me!