Coronavirus: భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు.. అప్రమత్తమైన యాంత్రాంగం.. !

By Mahesh Rajamoni  |  First Published Jun 3, 2022, 10:58 AM IST

Coronavirus Updates: కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం భార‌త్ లో రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతం, వార‌పు  పాజిటివిటీ రేటు 0.56 శాతంగా నమోదైంది. కొత్త కేసుల్లో పెరుగుద‌ల చోటుచేసుకుంది. 
 


Coronavirus disease: క‌రోనా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చి సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా.. దానికి వ్య‌తిరేకంగా టీకాలు అందుబాటులోకి వ‌చ్చినా.. దాని ప్రభావం మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకూ త‌న రూపు మార్చుకుంటున్న కోవిడ్‌-19 అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వెలుగులోకి వ‌చ్చిన ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్లు రెట్టింపు వ్యాప్తి, ప్ర‌భావం క‌లిగించేవిగా ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు, వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో బీఏ.4 ఒమిక్రాన్ వేరియంట్ మొద‌టి కేసును గుర్తించారు. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) గతంలో తెలంగాణతో పాటు తమిళనాడులోనూ BA.4, BA.5 వేరియంట్‌లతో కేసులను నిర్ధారించింది. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో BA.4 వేరియంట్‌కు సంబంధించి దేశంలో మొట్టమొదటి కేసు న‌మోదు అయ్యింది. అలాగే, పూణేలో ఒమిక్రాన్ స్ట్రెయిన్ BA.4, BA.5 సబ్‌వేరియంట్ లకు సంబంధించిన ఏడు కేసుల‌ను గుర్తించారు. 

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల ప్ర‌మాద‌క‌ర అంచ‌నాల మ‌ధ్య భార‌త్ క‌రోనా వైర‌స్ రోజువారీ కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో ఏకంగా నాలుగు వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లలో ఒకే రోజు పెరుగుదల 84 రోజుల తర్వాత 4,000 కంటే ఎక్కువ నమోదైంది. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. భార‌త్ లో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,041 క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కేసులు న‌మోద‌య్యాయి. దీంతో  మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,31,68,585కి చేరుకుంది.  అయితే క్రియాశీల కేసులు 21,177కి పెరిగాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్‌-19 మ‌ర‌ణాలు సంఖ్య 5,24,651కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.05 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Latest Videos

రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా నమోదైంది. వారంవారీ సానుకూలత రేటు 0.56 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కేసులు, మ‌ర‌ణాలు అధికంగా మ‌హారాష్ట్రలో న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాతి స్థానంలో కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, హ‌ర్యానాలు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 193.8 కోట్ల కోవిడ్‌-19 వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 91.6 కోట్లుగా ఉండ‌గా, రెండు డోసుల తీసుకున్న వారి సంఖ్య 82.9 కోట్లు దాటింది. క‌రోనా వైర‌స్ కొత్త కేసులు పెరుగుద‌ల‌, మ‌రోవైపు మంకీపాక్స్ ప్ర‌పంచ దేశాల‌ను చుట్టుముడుతున్న క్ర‌మంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల‌ను హెచ్చ‌రిస్తోంది. క‌రోనా, మంకీపాక్స్ కు సంబంధించిన అంశాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తోంది. అయితే, భార‌త్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మంకీపాక్స్ కేసు కూడా న‌మోదుకాలేద‌ని అధికారులు వెల్ల‌డించారు. అలాగే, అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. 

click me!