కరోనా ఒకసారి వస్తే మళ్లీ రాదా..?

By telugu news teamFirst Published Jul 24, 2020, 9:21 AM IST
Highlights

వైరస్ సోకి తర్వాత కోలుకున్నవారికి మరో రెండు నెలల్లో మరోసారి ఎటాక్ అవుతుందటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త కూడా ప్రజలను భయపెడుతోంది.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కొన్ని లక్షల మందికి సోకింది. వేల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. భారత్ లోనూ ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ దాదాపు 50వేల కేసులు నమోదౌతున్నాయి. దీంతో... ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అందులోనూ దేశంలో ఈ వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని అధికారులు చెబుతున్నారు. 

దీంతో.. ప్రజలు మరింత భయపడిపోతున్నారు. ఎటునుంచి వైరస్ ఎటాక్ చేస్తుందో అసలు తెలియడం లేదు. ఈ క్రమంలో.. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. వైరస్ సోకి తర్వాత కోలుకున్నవారికి మరో రెండు నెలల్లో మరోసారి ఎటాక్ అవుతుందటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త కూడా ప్రజలను భయపెడుతోంది.

అయితే.. దీనిపై సంబంధిత నిపుణులు వివరణ ఇచ్చారు. శరీరంలో కరోనా యాంటీబాడీలు రెండు నెలలకు మించి ఉండవు అంటూ కొన్ని అధ్యయనాల్లో తేలడం.. వారి ఆందోళనకు ఆజ్యం పోస్తోంది. కాగా.. కరోనా రెండోసారి సోకడం అత్యంత అరుదుగా జరుగుతుందని పలువురు ఎపిడమాలజిస్టులు, వైద్యనిపుణులు భరోసా ఇస్తున్నారు. 

కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి తెలిసింది గత ఏడు నెలలుగానే. ఇంత తక్కువ సమయంలో ఒక వైరస్‌ గురించి సవివరంగా తెలుసుకోవడం కష్టమేగానీ.. తెలిసినంతలో ఈ వైరస్‌ ఇప్పటిదాకా మనకు తెలిసిన వైర్‌సల లాగానే వ్యవహరిస్తోందని, కాబట్టి వ్యాక్సిన్‌ ద్వారా కరోనాకు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమేనని వారు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ బారిన పడినవారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్‌ రెండు, మూడు నెలల తర్వాత శక్తిని  కోల్పోతాయని ఇటీవల రెండు అధ్యయనాల్లో తేలినప్పటికీ.. అది సహజమేనని హార్వర్డ్‌ వర్సిటీకి చెందిన ప్రముఖ ఇమ్యూనాలజిస్టు డాక్టర్‌ మైకేల్‌ మినా తెలిపారు. వైర్‌సతో పోరాడేది కేవలం యాంటీబాడీలే కాదని.. టి-సెల్స్‌ కూడానని ఆయన గుర్తుచేశారు. ఆ కణాలు వైర్‌సతో సమర్థంగా పోరాడుతాయని యేల్‌ వర్సిటీ ఇమ్యూనాలజిస్టు డాక్టర్‌ అకికో ఇవసాకీ తెలిపారు.

చాలా తక్కువ మందికి మాత్రమే.. వైరస్ రెండో సారి ఎటాక్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. లేదు.. వాళ్లు మళ్లీ ఆ మహమ్మారి బారిన పడ్డారు అంటే.. అది కొత్తగా వచ్చినది కాదని.. వాళ్ల శరీరంలో గతంలో ఉన్నదే అయ్యి ఉంటుందని చెబుతున్నారు. మొదటిసారి వైరస్ ఎటాక్ అయిన సమయంలోనే.. అది ఎక్కడో ఓ మూల ఉండి ఉండచ్చని.. అది శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిన సమయంలో మరోసారి దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది కూడా చాలా తక్కువ మందిలో జరుగుతుందని చెప్పారు. 


 

click me!